జాధవ్‌పై పాక్ ఆర్మీ మరో కుట్ర
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో బందీగా ఉన్న భారతీయుడు కులభూషణ్ జాధవ్‌ను దోషిగా చూపించేందుకు పాక్ ఆర్మీ మళ్లీ కుటిలయత్నాలు చేస్తోంది. మాజీ భారత నేవీ అధికారి అయిన జాధవ్‌ను గూఢచర్యం కేసులోనే విచారించి మరణశిక్ష విధించామని నమ్మించేందుకు కొత్త నాటకాలాడుతోంది.
తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ జాధవ్.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వాకు పిటిషన్ పెట్టుకున్నారని ఆ దేశ ఆర్మీ ప్రజాసంబంధాల విభాగం గురువారం తెలిపింది. గూఢచర్యం, ఉగ్రవాదం, విద్రోహచర్యల్లో తను భాగస్వామినేనని.. చేసిన తప్పు కు పశ్చాత్తాపపడుతున్నట్లు జాధవ్ ఈ పిటిషన్‌లో ఒప్పుకున్నారని పేర్కొంది. ఉగ్రవా దం, గూఢచర్యానికి పాల్పడ్డట్లుగా తాజాగా జాధవ్ ఒప్పుకుంటున్న వీడియోను కూడా పాక్ ఆర్మీ విడుదల చేసింది.