అగ్రరాజ్యంతో పాక్ డబుల్ గేమ్!
వాషింగ్టన్: అమెరికాతో పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడుతోందని, ఆ విషయాన్ని మీరు గమనిస్తున్నారా అని అమెరికాలో కొందరు చట్టసభల ప్రతినిధులు అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలకవర్గాన్ని ప్రశ్నించారు. ఈ విషయం తమకు చాలా ఆందోళనకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్కు అణ్వాయుధాలను విసరగల సామర్థ్యం ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత శ్రేణి నాయకులంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాన్ కెర్రీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఓ పక్క తమ దేశంలో ఉగ్రవాద సమస్యను నిర్మూలించేందుకు ఆయుధ సామర్థ్యం అవసరం అని పాకిస్థాన్ చెబుతూనే వాటిని తమ దేశ సొంత ప్రజలపైనే ప్రయోగించడంతోపాటు భారత్, అఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తూ డబుల్ గేమ్ అడుతోందని, ఇది అమెరికాతో డబుల్ గేమ్ ఆడినట్లే అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
'ఈ విషయంపై మనమేం చేస్తున్నాం? ఏ విధంగా పాకిస్థాన్ కు సహాయం చేయాలనుకుంటున్నాం? ఉగ్రవాదంపై పోరాటానికే ఆ ఆయుధాలను పాక్ ఉపయోగిస్తుందని ఏ విధంగా భావించాలి?' అంటూ తన శాఖకు కావాల్సిన నిధుల కోసం బడ్జెట్ ప్లాన్ సమర్పించే సమయంలో విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎలియట్ ఎంగెల్, ఇతరులు జాన్ కెర్రీని ప్రశ్నించారు. అయితే, దీనిపై సూటిగా సమాధానం చెప్పని కెర్రీ.. ఉగ్రవాద నిరోధం కోసం అప్ఘనిస్తాన్కు సహాయం చేస్తున్నట్లుగానే పాకిస్థాన్ కు చేస్తున్నట్లు చెప్పినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.