ఇస్లామాబాద్ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. తమ దేశంలో ఉంటున్న భారత దౌత్యాధికారులను తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తోంది. వారికి గ్యాస్ కనేక్షన్లు ఇవ్వకుండా ఉండటం, ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాల గురించి సమాచారం అందుకున్న భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాక భారత దౌత్యాధికారులను కలవడానికి వచ్చిన అతిథులను కూడా పాక్ అధికారులు ఇలానే వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇస్లామాబాద్‌లోని తమ ఇంట్లోకి చొరబడ్డాడని ఓ భారత దౌత్యాధికారి తెలిపారు. భారత దౌత్యాధికారులను ఇలా వేధిపులకు గురి చేయడం ఇదే ప్రథమం కాదు.
అయితే గత కొంత కాలంగా భారత్, పాక్ మధ్య దౌత్యపర ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. గత నెల గురుద్వారా నన్‌కానా సాహిబ్‌లోకి భారత దౌత్యాధికారులు వెళ్తుండగా పాక్ భద్రతా సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. అంతేగాక వారిని తీవ్రంగా అవమానించారు. ఈ చర్యలను భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దౌత్యాధికారులను ప్రార్థానా మందిరాల్లోకి వెల్లకుండా ఆపే హక్కు పాక్ అధికారులకు లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి 1974లో చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేసింది. దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లవచ్చంటూ 1974లో ఇరు దేశాలు ధ్వైపాక్షిక ప్రొటోకాల్‌పై ఒప్పందం చేసుకున్నాయి. అలాగే, 1992లో ఈ విషయం గురించి కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి.
కానీ పాక్ వీటిని ఉల్లంఘించింది. ఈ ఏడాది మార్చిలోనూ దౌత్యపరంగా తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఓ ఒప్పందానికి వచ్చాయి. అయినప్పటికీ పాక్ తన తీరును మార్చుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దౌత్యాధికారుల కోసం ఇస్లామాబాద్‌లో నిర్మిస్తోన్న భవనాల్లో సోదాలు జరిపి.. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. నిర్మాణ పనులు ముగుస్తున్న సమయంలో ఆ పనులను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే పాక్ ఈ చర్యకు పాల్పడిందని అధికారులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment