బాలుని హత్యకేసులో దోషికి ఉరి అమలు
కరాచీ: ఏడేళ్ల బాలున్ని హత్య చేసిన కేసులో షెఫాకత్ హుస్సేన్కి పాకిస్తాన్ ఉరిశిక్ష అమలు చేసింది. 2004లో కరాచీకి చెందిన ఏడేళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో షెఫాకత్ దోషిగా కోర్టు నిర్ధారించి ఉరిశిక్ష విదించింది. అయితే నాలుగుసార్లు ఉరి అమలు చివరి క్షణాల్లో వాయిదా పడుతూ వచ్చింది. ఆ సంఘటన జరిగిన సమయంలో షెఫాకత్ వయస్సు 14 సంవత్సరాలు మాత్రమే అని, మైనర్ కావడం వల్ల ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని అతని తరఫు న్యాయవాదులు కోరారు. ఆ హత్య కూడా కావాలని చేసింది కాదని, అసంకల్పితంగా జరిగిందని కోర్టుకు తెలిపారు. దీనికి ప్రపంచ మానవ హక్కుల సంఘం వాళ్లు కూడా అండగా నిలిచినా వీటన్నిటినీ తోసి పుచ్చి సోమవారం అర్ధ రాత్రి కరాచీ జైలులో ఉరి అమలు చేసినట్టు అధికారులు తెలిపారు. న్యాయపరమైన కారణాలతో ఈ సంవత్సరంలోనే ఇప్పటికే నాలుగు సార్లు షెకావత్ ఉరి వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పటికే న్యాయస్థానం వీలైనన్ని అవకాశాలు కూడా కల్పించిందని, కానీ హత్య అతను చేయలేదని నిరూపించుకోవడంలో సరైన ఆధారాలు సమర్పించలేకపోయాడని అందుకే ఉరిశిక్ష అమలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
అనేక వాయిదాలు, క్షమాభిక్ష పిటీషన్లు, అంతర్జాతీయ సహకారం, ఏవీ కూడా అతని మరణశిక్షన ఆపలేకపోయాయి.150 మంది మరణానికి కారణమైన పెషావర్ స్కూల్ బాంబు పేలుడు అనంతరం 2008నుంచి అమలులో ఉన్న ఉరిశిక్ష నిషేధాన్ని డిసెంబర్2014 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ఎత్తివేసింది.