
ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు, దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.
ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తమ కథనాల్లో వెల్లడించింది.
కాగా ఇటీవల చాగాంగ్ ప్రావిన్సులో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు.
ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.
Comments
Please login to add a commentAdd a comment