అణు శాస్త్రవేత్తను ఉరి తీశారు
టెహ్రాన్: అమెరికా కోసం గూఢచర్యం నిర్వహిస్తున్నాడనే ఆరోపణల కింద అరెస్టు చేసిన ప్రముఖ అణుశాస్త్రవేత్త శహ్రామ్ అమిరిని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వ సంస్థలు స్పష్టం చేశాయి. ఇరాన్ అణుకార్యక్రమం గురించిన కీలక సమాచారాన్ని బయటకు లీక్ చేశాడనే ఆగ్రహంతో ఆయనను ఉరి తీసినట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియాలో ఆయన 2009లో కిడ్నాప్ కు గురై అనంతరం అమెరికాలో కనిపించారు. తిరిగి 2010లో ఇరాన్ కు వచ్చారు.
ఆ సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వ బలగాల వద్దే ఉన్న శహ్రామ్ ను ఉరి తీసి తమ ఇంటికి మృతదేహాన్ని పంపించినట్లు అతడి తల్లి దండ్రులు చెప్పారు. అతడి మెడ చుట్టు తాడు బిగించిన గుర్తు ఉందని వివరించారు. 1977లో జన్మించిన శహ్రామ్ 2009లో మక్కా యాత్రకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అనంతరం అతడు అమెరికాలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండి అనంతరం ఇరాన్ కు వచ్చాడంట. అలా రహస్యంగా ఉన్న సమయంలోనే అతడు ఇరాన్ అణు కార్యక్రమాలను లీక్ చేశాడని ఆరోపించి ఇరాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.