ఇస్లామాబాద్: పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ముఖంపై స్థానికుడు ఒకరు సిరా పోశారు. పంజాబ్ ప్రావిన్సులో శనివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్ పరిణామానికి స్పందించిన అక్కడి పోలీసులు వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. సిరా పోసిన వ్యక్తిని ఫయాజ్ రసూల్‌గా గుర్తించారు. అతడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని గుర్తించారు.
నవాజ్ షరీఫ్‌పై చెప్పుతో దాడి
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గర్హీ సాహూలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన షరీఫ్‌పై ఓ యువకుడు షూతో దాడి చేశాడు. షరీఫ్ తన ప్రసంగం ప్రారంభించే కంటే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. షూతో దాడి చేసిన యువకుడిని షరీఫ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment