Navaz Sharif
-
‘నేను ఉంటే ఇలా అయ్యేది కాదు’
ఇస్లామాబాద్: ‘మూడు సంవత్సరాల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. ఈ 3 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి.. మీ ముఖాల్లో నవ్వు మాయమయ్యింది. నేను ఉంటే ఇలా అయ్యేది కాదు అన్నారు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గుజ్రాన్వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వంపైన, ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బజ్వాపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది.. నిత్యవసరాలు మొదలు బంగారం దాక అన్నింటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 మిలయన్ల ఉద్యోగాలు అన్నారు.. కానీ 15 మిలియన్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఐదు మిలియన్ల ఇళ్లు కట్టిస్తాం అన్నారు.. ఒక్క ఇంటిని అయినా నిర్మించారా’ అని ప్రశ్నించారు. అలానే 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారం కట్టబెట్టాడని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. (చదవండి: పాకిస్తాన్లో విపక్ష కూటమి) 'జావేద్ బజ్వా.. మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి ప్రధాని పదవి కట్టబెట్టారు' అని షరీఫ్ వ్యాఖ్యానించారు. కాగా, 2018 ఎన్నికల తర్వాత నవాజ్ షరీఫ్ బహిరంగ సభలో మాట్లాడటం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగంపై కూడా నవాజ్ విమర్శలు చేశారు. అప్పటి తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం పని చేసిందని షరీఫ్ ఆరోపించారు. ఇప్పటికైనా రాజకీయాల్లో పాక్ ఆర్మీ జోక్యం మానుకోవాలని హితవు పలికారు. దాదాపు 9 విపక్ష పార్టీలన్నీ కలిసి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ (పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేల్చిన పాక్ సుప్రీంకోర్టు ఆయనకు 2017లో 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో లండన్‌లో చికిత్స పొందుతున్నారు. (చదవండి: ఇమ్రాన్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే) ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సంస్కరణలవల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, ఆర్థిక మాంద్యం రెండు అంకెలకు చేరిపోయిందని నవాజ్ షరీఫ్ విమర్శించారు. 'మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కూడా 'మీ టైం అయిపోయింది ఇమ్రాన్ ఇక వెళ్లండి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. -
మంత్రి ముఖంపై సిరా పోసి నిరసన!
ఇస్లామాబాద్: పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతోన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ముఖంపై స్థానికుడు ఒకరు సిరా పోశారు. పంజాబ్ ప్రావిన్సులో శనివారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. రాజ్యాంగ చట్టాల పేరుతో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ ముస్లింల మనోభావలను దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని నిందితుడు ఆరోపించాడు. ఈ హఠాత్ పరిణామానికి స్పందించిన అక్కడి పోలీసులు వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. సిరా పోసిన వ్యక్తిని ఫయాజ్ రసూల్‌గా గుర్తించారు. అతడికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని గుర్తించారు. నవాజ్ షరీఫ్‌పై చెప్పుతో దాడి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గర్హీ సాహూలో శనివారం జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన షరీఫ్‌పై ఓ యువకుడు షూతో దాడి చేశాడు. షరీఫ్ తన ప్రసంగం ప్రారంభించే కంటే ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. షూతో దాడి చేసిన యువకుడిని షరీఫ్ మద్దతుదారులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. -
నవాజ్ షరీఫ్‌పై షూ విసిరిన యువకుడు
-
మైకు దగ్గరకు రాగానే షూ..
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై లాహోర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఓ యువకుడు షూ విసిరిన ఘటన కలకలం రేపింది. వేదికపై షరీఫ్ మాట్లాడుతుండగా అనూహ్యంగా షూ ఆయనపైకి దూసుకొచ్చింది. లాహోర్‌కు సమీపంలోని గర్హి షాహులో జామియనీమియా సెమినరీకి మాజీ ప్రధాని హాజరైన క్రమంలో సెమినరీ మాజీ స్టూడెంట్ షరీఫ్పైకి షూ విసిరారు. ప్రేక్షకుల నుంచి విసిరన షూ నేరుగా షరీఫ్ ఛాతీకి తగిలింది. షూ విసిరిన యువకుడు వేదికపైకి వచ్చి నినదించడంతో అతడిని నిర్భందించిన నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. వివాదం సద్దుమణిగిన అనంతరం నవాజ్ షరీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
మాజీ ప్రధాని కుమార్తె, అల్లుడికి బెయిల్
ఇస్లామాబాద్: పనామా పత్రాల కేసులో పాక్ ప్రధానిగా వైదొలగిన నవాజ్ షరీఫ్ కుమార్తె, అల్లుడుకి బెయిల్ లభించింది. అయితే అవినీతి కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు ఎదుట నవాజ్ షరీఫ్ హాజరు కాలేదు.కోర్టు ఎదుట హాజరయ్యేందుకు మార్యం నవాజ్ (43) తన భర్త, మాజీ ఆర్మీ కెప్టెన్ మహ్మద్ సఫ్దర్‌తో కలిసి ఇస్లామాబాద్‌కు తిరిగివచ్చారు. కోర్టుకు చేరుకున్న వెంటనే ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో సప్ధర్ను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి వారు ఇరువురూ అకౌంటబిలిటీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ బషీర్ ఎదుట వేర్వేరుగా హాజరయ్యారు.విచారణ సందర్భంగా నవాజ్ షరీఫ్ ఆయన ఇద్దరు కుమారులు గైర్హాజరయ్యారు. గొంతు క్యాన్సర్‌తో నవాజ్ భార్య బాధపడుతున్నక్రమంలో వారు లండన్‌లో ఉన్నారు. గతంలో జరిగిన రెండు విచారణలకు హాజరైన నవాజ్ షరీఫ్ సర్జరీ జరుగుతున్న క్రమంలో భార్యను చూసేందుకు గత వారం లండన్‌కు చేరుకున్నారు. కాగా పనామా పత్రాల కేసులో మార్యం, సఫ్దర్లు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తులను అంగీకరించిన కోర్టు అక్టోబర్ 13 వరకూ విచారణను వాయిదా వేసింది. -
శాంతి, సహకారంతో సత్వరాభివృద్ధి
పాక్ ప్రధాని షరీఫ్‌కు లేఖలో భారత ప్రధాని మోడీ ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం కోసం ఎదురు చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఘర్షణలు, హింసకు తావులేని వాతావరణంలో పాక్‌తో కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జూన్ 2న తనకు రాసిన లేఖకు స్పందనగా మోడీ ఆయనకు ఈ మేరకు ప్రతి లేఖ రాశారు. శాంతి, స్నేహం, సహకారంతో కూడిన ద్వైపాక్షిక బంధం ఇరు దేశాల్లోని యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజల భవిష్యత్తును ఉజ్వలంచేస్తూ ఉభయ దేశాల సత్వరాభివృద్ధికి దోహదపడుతుందని మోడీ లేఖలో వివరించారు. ‘‘మీ (షరీఫ్) ఢిల్లీ పర్యటన సందర్భంగా నాతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఘర్షణరహిత వాతావరణంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయాన్ని లిఖించేందుకు మీతో, మీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ మోడీ రాసిన లేఖను పాక్ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనందుకు షరీఫ్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీతోపాటు ఇతర అతిథుల రాక ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరింత వన్నె తేవడమే కాకుండా భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య శక్తిని చాటే వేడుక అయ్యింది’’ అని మోడీ పేర్కొన్నారు. కాగా, కరాచీలోని విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడిని మోడీ తీవ్రంగా ఖండించారు. తన తల్లికి చీరను బహుమతిగా పంపినందుకు షరీఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఉగ్ర నియంత్రణకు కట్టుబడి ఉండండి
నవాజ్ షరీఫ్‌కు మోడీ సూచన మీ భూభాగం నుంచి చొరబడుతున్న ఉగ్రవాదుల్ని నియంత్రించండి న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌లోకి చొరబడి ఉగ్రవాదులు సృష్టిస్తున్న హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద నియంత్రణకు కట్టుబడి ఉండాలని ఆయన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సూచించారు. ఇక ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సంప్రదింపులు జరిపేలా ఇద్దరు ప్రధానులు ఒక అంగీకారానికి వచ్చారు. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు గత రెండేళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు మంగళవారమే ఎనిమిది సార్క్ దేశాల నేతలతో మోడీ చర్చలు జరిపారు. వీరితో నవాజ్ షరీఫ్‌తో భేటీకి ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఆ సమావేశం వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ మంగళవారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. సుజాతా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... భారత్‌లో ఉగ్రవాదాన్ని విస్తరించడానికి ఉగ్రవాదులు పాక్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నారని, దాన్ని నియంత్రించేందుకు కట్టుబడి ఉండాలని షరీఫ్‌కు మోడీ సూచించారు. ముంబైలో ఉగ్రవాదుల దాడి కేసులో నిందితులకు తగిన శిక్ష పడేలా పాక్ చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఏమైనా చర్చించారా అని అడగ్గా.. ఉగ్రవాదానికి సంబంధించి చాలా అంశాలు చర్చించారని సుజాతా సింగ్ చెప్పారు. కాశ్మీర్ అంశం గురించి చర్చ జరిగిందా అని అడగ్గా.. దీనిపై ఏం చేయాలన్నది విదేశాంగ కార్యదర్శులు చర్చిస్తారని వివరించారు. పాకిస్థాన్‌కు రావాల్సిందిగా మోడీకి ఆహ్వానాలు వచ్చాయని, వాటికి ఆయన అంగీకరించారని, ఇంకా తేదీలు ఖరారు కాలేదన్నారు. ఘర్షణను సహకారంగా మార్చుకోవాలి: షరీఫ్ శాంతి, ప్రగతి, సౌభాగ్యం కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని, ఘర్షణను సహకారంగా మార్చుకోవాల్సిన అవసరముందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో అన్నారు. మోడీతో తొలి భేటీ తర్వాత షరీఫ్ స్వదేశం వెళ్లేముందు విలేకరతో మాట్లాడారు. మోడీతో సమావేశం సుహృద్భావంతో నిర్మాణాత్మకంగా సాగిందన్నారు. ఈ స్ఫూర్తితో.. ద్వైపాక్షిక అజెండాను సమీక్షించి, ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో విదేశాంగ కార్యదర్శుల భేటీ నిర్వహించేందుకు తాను, మోడీ అంగీకరించామన్నారు. అనంతరం నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. -
మోడీకి విదేశీ మీడియా విస్తృత కవరేజీ
బీజింగ్/వాషింగ్టన్: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ మీడియా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా చైనా, అమెరికా పత్రికలు విస్తృత కవరేజీ ఇస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) నేతలను ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడాన్ని భారత్ విదేశీ వ్యవహారాల్లో సానుకూల పరిణామంగా అభివర్ణించాయి. అలాగే కొత్త ప్రభుత్వం సారథ్యంలో భారత్ మంచి మార్పుతో ఆర్థిక ప్రగతి వైపు దూసుకెళ్తుందని అమెరికాలోని లాస్ ఏంజెలిస్ టైమ్స్ పత్రిక పేర్కొంది. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లవద్దంటూ స్వదేశీ నిఘా సంస్థ (ఐఎస్ఐ) హెచ్చరించినా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాత్రం హాజరుకావడాన్ని స్వాగతించింది. -
భారత్-పాక్‌ల మాటల తూటాలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ‘కాశ్మీర్’పై భారత్-పాక్‌ల నడుమ బుధవారం మరోసారి మాటల తూటాలు పేలాయి. కాశ్మీర్ సమస్య ఏ సమయంలోనైనా భారత్‌తో నాలుగో యుద్ధానికి దారితీయవచ్చని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ‘డాన్’ దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ముజాఫరాబాద్‌లో ఆజాద్ జమ్మూ కాశ్మీర్ కౌన్సిల్ (ఏజేకే) బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన సందర్భంగా షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. దీనిపై భారత ప్రధాని మన్మోహన్ సింగ్ దీటుగా స్పందించారు. తన జీవితకాలంలో పాకిస్థాన్‌కు భారత్‌పై యుద్ధాన్ని గెలిచే పరిస్థితే లేదని వ్యాఖ్యానించారు. అయితే, ‘డాన్’లో ఈ విషయమై వచ్చిన కథనాన్ని పాక్ ప్రధాని కార్యాలయం ఖండించింది. ప్రధాని షరీఫ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆ కథనం పూర్తిగా నిరాధారమైనదని, దురుద్దేశపూరితంగా ఆ కథనాన్ని ప్రచురించారని ఆరోపించింది. -
భారత నేతలు అనవసరంగా పాక్‌ను నిందిస్తున్నారు
బ్రిటిష్ ఉప ప్రధానితో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్: భారత నేతలు ఇప్పటికీ పాకిస్థాన్‌ను అనవసరంగా నిందిస్తున్నారని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. ఒకవైపు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద తరచు జరుగుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న సమయంలో బ్రిటిష్ ఉపప్రధాని నిక్ క్లెగ్ వద్ద నవాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. లండన్‌లో ఇటీవల పర్యటించిన నవాజ్, తన పర్యటనలో భాగంగా క్లెగ్‌తో భేటీ అయ్యారు. భారత్‌ను నిందించడం తాము మానేసినా, భారత రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికీ పాక్‌ను నిందించడం కొనసాగిస్తున్నారని అన్నారు. భారత్‌తో గల అన్ని సమస్యలనూ పరిష్కరించుకునేందుకు పాక్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, మరోవైపు తాలిబన్లతో కూడా చర్చలు ప్రారంభించామని క్లెగ్‌తో చెప్పారు. -
మన్మోహన్‌ను ‘పల్లె మహిళ’ అనలేదు: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: భారత ప్రధాని మన్మో„హన్ సింగ్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై రేగిన వివాదానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెరదించారు. తాను మన్మో„హన్ను ఎన్నడూ ‘పల్లె మహిళ’(దెహతీ ఔరత్) అని అనలేదని లండన్‌లో విలేకర్లతో అన్నారు. ఈమేరకు పాక్ పత్రికలు మంగళవారం వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా మన్మో„హన్ పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పిన నేపథ్యంలో.. నవాజ్ ఓ ఇంటర్వ్యూలో మన్మో„హన్ పల్లె మహిళలా ఫిర్యాదు చేశారని అన్నట్లు వార్తలు రావడం తెలిసిందే. -
జమ్మూలో రెండు ‘ఉగ్ర’ దాడులు
ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు జమ్మూ: సైనిక దుస్తుల్లో సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు గురువారం వేకువ జామున జమ్మూ ప్రాంతంలో జంట దాడులకు పాల్పడ్డారు. తొలుత ఒక పోలీస్ స్టేషన్‌పైన, తర్వాత ఒక సైనిక శిబిరంపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక ఆర్మీ అధికారి సహా నలుగురు సైనిక సిబ్బంది, ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత్-పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్‌ల భేటీకి మూడు రోజుల ముందే జరిగిన ఈ దాడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. భారత్, పాక్ ప్రభుత్వాలు ఈ దాడిని ఖండించాయి. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులూ 16 నుంచి 19 ఏళ్ల లోపు వారేనని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు తొలుత పాక్ సరిహద్దుల వద్దనున్న కఠువా జిల్లా హీరానగర్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపారు. తర్వాత సాంబా ప్రాంతంలోని సైనిక శిబిరంపై దాడికి దిగారు. పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు, ఒక దుకాణదారు, సమీపంలోనే నిలిపి ఉన్న ట్రక్కు క్లీనర్ మృతి చెందారు. ట్రక్కును హైజాక్ చేసిన ఉగ్రవాదులు పఠాన్‌కోట్-జమ్మూ రహదారి మీదుగా ఉదయం సుమారు 8.30 గంటలకు సాంబా శిబిరం వద్దకు చేరుకున్నారు. సాంబా శిబిరంలోని ఆఫీసర్స్ మెస్‌లోకి చొరబడి దాడి జరిపారు. ఈ దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ బిక్రమ్‌జీత్ సింగ్ సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పఠాన్‌కోట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స చేస్తున్నారు. సాంబా శిబిరం వద్ద ఉగ్రవాదులకు, సైనికులకు నడుమ దాదాపు తొమ్మిది గంటల సేపు హోరాహోరీ పోరు సాగింది. సైనికుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ మరణించారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఉగ్రవాద సంస్థ ‘షొహాదా బ్రిగేడ్’ ప్రకటించింది. పాక్ సరిహద్దులకు కేవలం కిలోమీటరు దూరంలోని ఝండీ గ్రామం హరియా ఛక్ శ్మశాన ప్రాంతంలో ఒక ఆటోవాలాను తుపాకులతో బెదిరించిన ఉగ్రవాదులు, అక్కడి నుం చి హీరానగర్ చేరుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ అశోక్ ప్రసాద్ చెప్పారు. హీరానగర్‌లోని ఆర్మీ క్యాంపు వద్దకు తీసుకువెళ్లాలని ఆటో డ్రైవర్‌ను వారు ఆదేశించారని, ఆర్మీ క్యాంపును గుర్తించలేకపోవడంతో పోలీస్‌స్టే షన్లో చొరబడి దాడికి దిగారని తెలిపారు. మృతులు వీరే...: సాంబా సైనిక శిబిరంపై జరిగిన దాడిలో మరణించిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ బిక్రమ్‌జీత్ సింగ్‌తో పాటు సిపాయిలు ఎం.శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ రెడ్డి, దయా సింగ్ ఉన్నారు. గాయపడ్డ వారిలో కల్నల్ అవిన్ ఉతయ్య, సిపాయి ఇంద్రజిత్ సింగ్ ఉన్నారు. కఠువా జిల్లా హీరానగర్ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఏఎస్సై రతన్ సింగ్, కానిస్టేబుళ్లు కుల్దీప్ సింగ్, శివకుమార్, ఎస్పీవో ముకేశ్ కుమార్, దుకాణదారులు సురేశ్‌కుమార్, ఫిర్దౌస్ అహ్మద్, ట్రక్కు క్లీనర్ మహమ్మద్ ఫిరోజ్ ఉన్నారని, ఏఎస్సై గంగారాం, కానిస్టేబుల్ రతన్ చంద్, ఆటో డ్రైవర్ రోషన్‌లాల్ గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇలాంటి చర్యలు చర్చల ప్రక్రియను అడ్డుకోలేవు: ప్రధాని ఫ్రాంక్ఫర్ట్: జమ్మూలో జరిగిన ‘ఉగ్ర’దాడులను ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి రెచ్చగొట్టే ఉగ్రవాద దాడులు భారత్-పాక్‌ల చర్చల ప్రక్రియను అడ్డుకోలేవన్నారు. ఈ దాడిని శాంతిని వ్యతిరేకించే శత్రువుల మరో దుశ్చర్యగా ప్రధాని అభివర్ణించారు. అమెరికా పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో బుధవారం రాత్రి బసచేసిన ఆయన గురువారం అమెరికా బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదేరోజు ప్రధాని మన్మోహన్ 81వ పుట్టినరోజు కాగా, ‘ఉగ్ర’దాడుల కారణంగా ఆయన కనీసం కేకునైనా కోయకుండా వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, న్యూయార్క్‌లో ఈనెల 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కానున్న మన్మోహన్, ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘ఉగ్ర’దాడులకు నిరసనగా శుక్రవారం జమ్మూ బంద్‌కు పిలుపునిచ్చింది. పాక్‌తో చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని, యూపీఏ సర్కారు ఆత్రపడుతున్నట్లు కనిపిస్తోందని, అయితే, ఇలాంటి సమయంలో మెతక వైఖరిని అవలంబించడం ఏమాత్రం తగదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని ప్రభుత్వం ఆరోపించింది. కాగా, ఉగ్రవాదాన్ని ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటామని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఎన్డీఏ హయాంలో కార్గిల్ యుద్ధానికి కారకుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్‌ను చర్చలకు ఆహ్వానించిన సంగతిని గుర్తు తెచ్చుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ బీజేపీకి హితవు పలికారు. జమ్మూలో జరిగిన ‘ఉగ్ర’దాడులు శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నమేనని, బీజేపీ కూడా శాంతిని, చర్చలను వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. శాంతి ప్రక్రియను వ్యతిరేకించే వారే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులకు తెగబడ్డారని కాంగ్రెస్ సమాచార విభాగం చైర్మన్ అజయ్ మాకెన్ అన్నారు. బీజేపీ కూడా ఇదే కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు.