ఉగ్ర నియంత్రణకు కట్టుబడి ఉండండి
నవాజ్ షరీఫ్‌కు మోడీ సూచన
మీ భూభాగం నుంచి చొరబడుతున్న ఉగ్రవాదుల్ని నియంత్రించండి
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌లోకి చొరబడి ఉగ్రవాదులు సృష్టిస్తున్న హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాద నియంత్రణకు కట్టుబడి ఉండాలని ఆయన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సూచించారు. ఇక ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు సంప్రదింపులు జరిపేలా ఇద్దరు ప్రధానులు ఒక అంగీకారానికి వచ్చారు. విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు గత రెండేళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు మంగళవారమే ఎనిమిది సార్క్ దేశాల నేతలతో మోడీ చర్చలు జరిపారు. వీరితో నవాజ్ షరీఫ్‌తో భేటీకి ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు.
దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఆ సమావేశం వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ మంగళవారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. సుజాతా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం... భారత్‌లో ఉగ్రవాదాన్ని విస్తరించడానికి ఉగ్రవాదులు పాక్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నారని, దాన్ని నియంత్రించేందుకు కట్టుబడి ఉండాలని షరీఫ్‌కు మోడీ సూచించారు. ముంబైలో ఉగ్రవాదుల దాడి కేసులో నిందితులకు తగిన శిక్ష పడేలా పాక్ చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి ఏమైనా చర్చించారా అని అడగ్గా.. ఉగ్రవాదానికి సంబంధించి చాలా అంశాలు చర్చించారని సుజాతా సింగ్ చెప్పారు. కాశ్మీర్ అంశం గురించి చర్చ జరిగిందా అని అడగ్గా.. దీనిపై ఏం చేయాలన్నది విదేశాంగ కార్యదర్శులు చర్చిస్తారని వివరించారు. పాకిస్థాన్‌కు రావాల్సిందిగా మోడీకి ఆహ్వానాలు వచ్చాయని, వాటికి ఆయన అంగీకరించారని, ఇంకా తేదీలు ఖరారు కాలేదన్నారు.
ఘర్షణను సహకారంగా మార్చుకోవాలి: షరీఫ్
శాంతి, ప్రగతి, సౌభాగ్యం కోసం ఇరుదేశాలు కలసికట్టుగా పనిచేయాలని, ఘర్షణను సహకారంగా మార్చుకోవాల్సిన అవసరముందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో అన్నారు. మోడీతో తొలి భేటీ తర్వాత షరీఫ్ స్వదేశం వెళ్లేముందు విలేకరతో మాట్లాడారు. మోడీతో సమావేశం సుహృద్భావంతో నిర్మాణాత్మకంగా సాగిందన్నారు. ఈ స్ఫూర్తితో.. ద్వైపాక్షిక అజెండాను సమీక్షించి, ముందుకు తీసుకెళ్లేందుకు త్వరలో విదేశాంగ కార్యదర్శుల భేటీ నిర్వహించేందుకు తాను, మోడీ అంగీకరించామన్నారు. అనంతరం నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.