శాంతి, సహకారంతో సత్వరాభివృద్ధి
పాక్ ప్రధాని షరీఫ్‌కు లేఖలో భారత ప్రధాని మోడీ
ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం కోసం ఎదురు చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఘర్షణలు, హింసకు తావులేని వాతావరణంలో పాక్‌తో కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జూన్ 2న తనకు రాసిన లేఖకు స్పందనగా మోడీ ఆయనకు ఈ మేరకు ప్రతి లేఖ రాశారు. శాంతి, స్నేహం, సహకారంతో కూడిన ద్వైపాక్షిక బంధం ఇరు దేశాల్లోని యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజల భవిష్యత్తును ఉజ్వలంచేస్తూ ఉభయ దేశాల సత్వరాభివృద్ధికి దోహదపడుతుందని మోడీ లేఖలో వివరించారు. ‘‘మీ (షరీఫ్) ఢిల్లీ పర్యటన సందర్భంగా నాతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
ఘర్షణరహిత వాతావరణంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయాన్ని లిఖించేందుకు మీతో, మీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ మోడీ రాసిన లేఖను పాక్ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనందుకు షరీఫ్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీతోపాటు ఇతర అతిథుల రాక ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరింత వన్నె తేవడమే కాకుండా భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య శక్తిని చాటే వేడుక అయ్యింది’’ అని మోడీ పేర్కొన్నారు. కాగా, కరాచీలోని విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడిని మోడీ తీవ్రంగా ఖండించారు. తన తల్లికి చీరను బహుమతిగా పంపినందుకు షరీఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.