జమ్మూలో రెండు ‘ఉగ్ర’ దాడులు | Army officer among 12 killed in Jammu terror attack | Sakshi
Sakshi News home page

జమ్మూలో రెండు ‘ఉగ్ర’ దాడులు

Published Fri, Sep 27 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

Army officer among 12 killed in Jammu terror attack

 ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి
   సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు

  జమ్మూ: సైనిక దుస్తుల్లో సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు గురువారం వేకువ జామున జమ్మూ ప్రాంతంలో జంట దాడులకు పాల్పడ్డారు. తొలుత ఒక పోలీస్ స్టేషన్‌పైన, తర్వాత ఒక సైనిక శిబిరంపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక ఆర్మీ అధికారి సహా నలుగురు సైనిక సిబ్బంది, ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత్-పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్‌ల భేటీకి మూడు రోజుల ముందే జరిగిన ఈ దాడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
 
 భారత్, పాక్ ప్రభుత్వాలు ఈ దాడిని ఖండించాయి. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులూ 16 నుంచి 19 ఏళ్ల లోపు వారేనని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు తొలుత పాక్ సరిహద్దుల వద్దనున్న కఠువా జిల్లా హీరానగర్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపారు. తర్వాత సాంబా ప్రాంతంలోని సైనిక శిబిరంపై దాడికి దిగారు. పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు, ఒక దుకాణదారు, సమీపంలోనే నిలిపి ఉన్న ట్రక్కు క్లీనర్ మృతి చెందారు. ట్రక్కును హైజాక్ చేసిన ఉగ్రవాదులు పఠాన్‌కోట్-జమ్మూ రహదారి మీదుగా ఉదయం సుమారు 8.30 గంటలకు సాంబా శిబిరం వద్దకు చేరుకున్నారు.
 
 సాంబా శిబిరంలోని ఆఫీసర్స్ మెస్‌లోకి చొరబడి దాడి జరిపారు. ఈ దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ బిక్రమ్‌జీత్ సింగ్ సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పఠాన్‌కోట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స చేస్తున్నారు. సాంబా శిబిరం వద్ద ఉగ్రవాదులకు, సైనికులకు నడుమ దాదాపు తొమ్మిది గంటల సేపు హోరాహోరీ పోరు సాగింది. సైనికుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ మరణించారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఉగ్రవాద సంస్థ ‘షొహాదా బ్రిగేడ్’ ప్రకటించింది. పాక్ సరిహద్దులకు కేవలం కిలోమీటరు దూరంలోని ఝండీ గ్రామం హరియా ఛక్ శ్మశాన ప్రాంతంలో ఒక ఆటోవాలాను తుపాకులతో బెదిరించిన ఉగ్రవాదులు, అక్కడి నుం చి హీరానగర్ చేరుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ అశోక్ ప్రసాద్ చెప్పారు. హీరానగర్‌లోని ఆర్మీ క్యాంపు వద్దకు తీసుకువెళ్లాలని ఆటో డ్రైవర్‌ను వారు ఆదేశించారని, ఆర్మీ క్యాంపును గుర్తించలేకపోవడంతో పోలీస్‌స్టే షన్‌లో చొరబడి దాడికి దిగారని తెలిపారు.
 
 మృతులు వీరే...: సాంబా సైనిక శిబిరంపై జరిగిన దాడిలో మరణించిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ బిక్రమ్‌జీత్ సింగ్‌తో పాటు సిపాయిలు ఎం.శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ రెడ్డి, దయా సింగ్ ఉన్నారు. గాయపడ్డ వారిలో కల్నల్ అవిన్ ఉతయ్య, సిపాయి ఇంద్రజిత్ సింగ్ ఉన్నారు. కఠువా జిల్లా హీరానగర్ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఏఎస్సై రతన్ సింగ్, కానిస్టేబుళ్లు కుల్దీప్ సింగ్, శివకుమార్, ఎస్పీవో ముకేశ్ కుమార్, దుకాణదారులు సురేశ్‌కుమార్, ఫిర్దౌస్ అహ్మద్, ట్రక్కు క్లీనర్ మహమ్మద్ ఫిరోజ్ ఉన్నారని, ఏఎస్సై గంగారాం, కానిస్టేబుల్ రతన్ చంద్, ఆటో డ్రైవర్ రోషన్‌లాల్ గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలను పరామర్శించారు.
 
 ఇలాంటి చర్యలు చర్చల ప్రక్రియను అడ్డుకోలేవు: ప్రధాని
 ఫ్రాంక్‌ఫర్ట్: జమ్మూలో జరిగిన ‘ఉగ్ర’దాడులను ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి రెచ్చగొట్టే ఉగ్రవాద దాడులు భారత్-పాక్‌ల చర్చల ప్రక్రియను అడ్డుకోలేవన్నారు. ఈ దాడిని శాంతిని వ్యతిరేకించే శత్రువుల మరో దుశ్చర్యగా ప్రధాని అభివర్ణించారు. అమెరికా పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో బుధవారం రాత్రి బసచేసిన ఆయన గురువారం అమెరికా బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదేరోజు ప్రధాని మన్మోహన్ 81వ పుట్టినరోజు కాగా, ‘ఉగ్ర’దాడుల కారణంగా ఆయన కనీసం కేకునైనా కోయకుండా వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, న్యూయార్క్‌లో ఈనెల 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కానున్న మన్మోహన్, ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
 
  ‘ఉగ్ర’దాడులకు నిరసనగా శుక్రవారం జమ్మూ బంద్‌కు పిలుపునిచ్చింది. పాక్‌తో చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని, యూపీఏ సర్కారు ఆత్రపడుతున్నట్లు కనిపిస్తోందని, అయితే, ఇలాంటి సమయంలో మెతక వైఖరిని అవలంబించడం ఏమాత్రం తగదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని ప్రభుత్వం ఆరోపించింది. కాగా, ఉగ్రవాదాన్ని ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటామని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఎన్డీఏ హయాంలో కార్గిల్ యుద్ధానికి కారకుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్‌ను చర్చలకు ఆహ్వానించిన సంగతిని గుర్తు తెచ్చుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ బీజేపీకి హితవు పలికారు. జమ్మూలో జరిగిన ‘ఉగ్ర’దాడులు శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నమేనని, బీజేపీ కూడా శాంతిని, చర్చలను వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. శాంతి ప్రక్రియను వ్యతిరేకించే వారే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులకు తెగబడ్డారని కాంగ్రెస్ సమాచార విభాగం చైర్మన్ అజయ్ మాకెన్ అన్నారు. బీజేపీ కూడా ఇదే కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement