Jammu region
-
జనావాసాలపై పాక్ దాడులు
- మోర్టారు బాంబులతో ఘాతుకం - 8 మంది భారత పౌరుల మృతి.. 22 మందికి గాయాలు - మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు - పాక్ దాడులకు దీటుగా జవాబిచ్చిన భారత ఆర్మీ - ఇద్దరు రేంజర్ల హతం సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత్‌ను మరింత కవ్వించేందుకు సామాన్య పౌరులే లక్ష్యంగా మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు నుంచే జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరీ జిల్లాలోని పీవోకే, ఐబీ వెంట మొదలు పెట్టిన దాడిలో 8 మంది పౌరులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇంత పెద్దసంఖ్యలో పౌరులు మృతిచెందటం ఇదే తొలిసారి. కాగా సరిహద్దు పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్ సమీక్షించారు. జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత్‌ను మరింత కవ్వించేందుకు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే మొదలుపెట్టిన దాడిలో 8 మంది పౌరులు మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇంతపెద్ద సంఖ్యలో పౌరులు మృతిచెందటం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పీవోకే, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్లతో పాక్ దాడికి దిగిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో పాక్ దాడుల్లో ఐదుగురు మరణించగా.. మరోవ్యక్తి షాక్‌తో మృతిచెందాడని, 9 మంది గాయపడ్డారని తెలిపాయి. గాయపడిన వారికి రామ్‌గఢ్ ఆస్పత్రిలో ప్రథమచికిత్స చేసి జమ్మూ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజౌరీ జిల్లాలోని మంజాకోటే సరిహద్దు గ్రామంలో ఇద్దరు మహిళలు మోర్టారు దాడుల్లో మృతిచెందగా.. ముగ్గురు ఆర్మీ పోర్టర్లకు కూడా గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. పూంచ్ సెక్టార్లో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. రాజౌరీలో ఉదయం మొదలైన కాల్పులు ఈ మూడు జిల్లాల్లో విస్తరించాయని బీఎస్ఎఫ్ డీఐజీ ధర్మేంద్ర పరీక్ వెల్లడించారు. ‘82 ఎంఎం మెర్టార్లతో అడపాదడపా కవ్వించారు. రాజౌరీలోని ఓ చిన్న గ్రామంలో సుల్తాన్ బేగం, మక్బూల్ బేగం అనే ఇద్దరు యువతులు మృతిచెందారు. పాక్ దాడులకు ఆర్మీ దీటైన సమాధానమిచ్చింది’ అని పరీక్ తెలిపారు. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్లో ఉదయం 7 గంటలకు జరిగిన మోర్టారు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఉదయం 5.30 నుంచే పాక్ కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. పాక్ దళాలు చిన్న, ఆటోమేటిక్ గన్లతో మొదలుపెట్టి.. మోర్టార్లతో దాడికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం నుంచి జరిగిన ఘటనల్లో పౌరులకు తీవ్ర నష్టం జరిగింది’ అని ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా తెలిపారు. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ 60సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. పాక్ కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన సర్కారు.. సరిహద్దు వెంబడి గ్రామాల్లోని 174 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. రాజ్‌నాథ్, పరీకర్ సమీక్ష సరిహద్దు పరిస్థితిని హోంమంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్ సమీక్షించారు. 8 మంది మృతి, 22 మందికి గాయాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. భేటీలో మంత్రులతోపాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సుహాగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 14 పాక్ పోస్టులు ధ్వంసం నియంత్రంణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలకూ భారత ఆర్మీ దీటైన జవాబిచ్చింది. రాజౌరీలోని నౌషెరా సెక్టార్లో ఇద్దరు భారత్ జవాన్లు జరిపిన ఎదురుదాడిలో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అటు జమ్మూలోని ఆర్నియా సెక్టార్‌కు సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ జరిపిన ఎదురుదాడిలో 14 పాక్ పోస్టులు ధ్వంసమయ్యాయని ఆర్మీ పేర్కొంది. -
పాక్‌ను దీటుగా దెబ్బకొడుతున్న సైన్యం!
జమ్మూ: పాకిస్థాన్ సైన్యం పెట్రేగిపోతుండటంతో సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం మంగళవారం విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది భారత పౌరులు ప్రాణాలు విడిచారు. 22 మంది గాయపడ్డారు. దీంతో భారత్ సైన్యం దీటుగా బదులిచ్చింది. మన సైన్యం జరిపిన ప్రతి కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు విడిచారు. సరిహద్దులకు ఆవల ఉన్న 14 పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి. పాక్ సైన్యం ఏకపక్షంగా కాల్పులకు దిగుతుండటంతో గతకొన్నాళ్లుగా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి పాక్ సైన్యాలు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా కాల్పులతో హోరెత్తిస్తున్నాయి. సాంబా, జమ్మూ, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు చేరువగా ఉన్న గ్రామాలు, సైనిక పోస్టులు లక్ష్యంగా భారీ తుపాకులతో కాల్పులు ప్రారంభించాయి. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు కూడా దీటుగా బదులిస్తున్నాయి. బీఎస్ఎఫ్ జరిపిన ప్రతి కాల్పుల్లో రామ్‌గఢ్, ఆర్నియా సెక్టర్లలోని 14 పాకిస్థాన్ రేంజర్స్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారని బీఎస్ఎఫ్ తెలిపింది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకొని పాక్ కాల్పులు చేస్తుండటంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు. -
పాక్ కాల్పులు : జమ్ము పౌరుడికి తీవ్ర గాయాలు
జమ్మూ : పాకిస్థాన్ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. తాజాగా శుక్రవారం ఉదయం సాధారణ నియంత్రణ రేఖపై పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుడు మహమ్మద్ అష్రాఫ్‌గా గుర్తించినట్లు తెలిపారు. అతడిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. క్షతగాత్రుడిది పూంచ్ జిల్లాలోని బసోని గ్రామానికి చెందిన వాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఈ రోజు ఉదయం నుంచే కాల్పులు ప్రారంభించిందని.. వెంటనే అప్రమత్తమైన భారత్ సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగిందన్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్
జమ్మూ : పాకిస్థాన్ తరచు కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ... తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. జమ్మూ ప్రాంతం సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో పూంచ్, రాజౌరీ జిల్లాలోని సైనికులే లక్ష్యంగా పాక్ సైన్యం శుక్రవారం రాత్రి కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి మనీష్ మెహతా వెల్లడించారు. ఈ కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయని ఆయన తెలిపారు. అయితే పాక్ సైనికులు దాడిని భారత సైన్యం తిప్పికొట్టిందన్నారు. పాక్ కాల్పుల్లో భారత్ సైన్యంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. -
జమ్మూలో రెండు ‘ఉగ్ర’ దాడులు
ఆర్మీ అధికారి సహా 12 మంది మృతి సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు జమ్మూ: సైనిక దుస్తుల్లో సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి చొరబడ్డ ముగ్గురు ఉగ్రవాదులు గురువారం వేకువ జామున జమ్మూ ప్రాంతంలో జంట దాడులకు పాల్పడ్డారు. తొలుత ఒక పోలీస్ స్టేషన్‌పైన, తర్వాత ఒక సైనిక శిబిరంపైన దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక ఆర్మీ అధికారి సహా నలుగురు సైనిక సిబ్బంది, ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ హతమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత్-పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్‌ల భేటీకి మూడు రోజుల ముందే జరిగిన ఈ దాడి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. భారత్, పాక్ ప్రభుత్వాలు ఈ దాడిని ఖండించాయి. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులూ 16 నుంచి 19 ఏళ్ల లోపు వారేనని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు తొలుత పాక్ సరిహద్దుల వద్దనున్న కఠువా జిల్లా హీరానగర్ పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపారు. తర్వాత సాంబా ప్రాంతంలోని సైనిక శిబిరంపై దాడికి దిగారు. పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు, ఒక దుకాణదారు, సమీపంలోనే నిలిపి ఉన్న ట్రక్కు క్లీనర్ మృతి చెందారు. ట్రక్కును హైజాక్ చేసిన ఉగ్రవాదులు పఠాన్‌కోట్-జమ్మూ రహదారి మీదుగా ఉదయం సుమారు 8.30 గంటలకు సాంబా శిబిరం వద్దకు చేరుకున్నారు. సాంబా శిబిరంలోని ఆఫీసర్స్ మెస్‌లోకి చొరబడి దాడి జరిపారు. ఈ దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ బిక్రమ్‌జీత్ సింగ్ సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పఠాన్‌కోట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స చేస్తున్నారు. సాంబా శిబిరం వద్ద ఉగ్రవాదులకు, సైనికులకు నడుమ దాదాపు తొమ్మిది గంటల సేపు హోరాహోరీ పోరు సాగింది. సైనికుల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులూ మరణించారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఉగ్రవాద సంస్థ ‘షొహాదా బ్రిగేడ్’ ప్రకటించింది. పాక్ సరిహద్దులకు కేవలం కిలోమీటరు దూరంలోని ఝండీ గ్రామం హరియా ఛక్ శ్మశాన ప్రాంతంలో ఒక ఆటోవాలాను తుపాకులతో బెదిరించిన ఉగ్రవాదులు, అక్కడి నుం చి హీరానగర్ చేరుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ డీజీపీ అశోక్ ప్రసాద్ చెప్పారు. హీరానగర్‌లోని ఆర్మీ క్యాంపు వద్దకు తీసుకువెళ్లాలని ఆటో డ్రైవర్‌ను వారు ఆదేశించారని, ఆర్మీ క్యాంపును గుర్తించలేకపోవడంతో పోలీస్‌స్టే షన్లో చొరబడి దాడికి దిగారని తెలిపారు. మృతులు వీరే...: సాంబా సైనిక శిబిరంపై జరిగిన దాడిలో మరణించిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ బిక్రమ్‌జీత్ సింగ్‌తో పాటు సిపాయిలు ఎం.శ్రీనివాసరావు, కిరణ్‌కుమార్ రెడ్డి, దయా సింగ్ ఉన్నారు. గాయపడ్డ వారిలో కల్నల్ అవిన్ ఉతయ్య, సిపాయి ఇంద్రజిత్ సింగ్ ఉన్నారు. కఠువా జిల్లా హీరానగర్ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో ఏఎస్సై రతన్ సింగ్, కానిస్టేబుళ్లు కుల్దీప్ సింగ్, శివకుమార్, ఎస్పీవో ముకేశ్ కుమార్, దుకాణదారులు సురేశ్‌కుమార్, ఫిర్దౌస్ అహ్మద్, ట్రక్కు క్లీనర్ మహమ్మద్ ఫిరోజ్ ఉన్నారని, ఏఎస్సై గంగారాం, కానిస్టేబుల్ రతన్ చంద్, ఆటో డ్రైవర్ రోషన్‌లాల్ గాయపడ్డారని అధికారులు తెలిపారు. కాగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇలాంటి చర్యలు చర్చల ప్రక్రియను అడ్డుకోలేవు: ప్రధాని ఫ్రాంక్ఫర్ట్: జమ్మూలో జరిగిన ‘ఉగ్ర’దాడులను ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి రెచ్చగొట్టే ఉగ్రవాద దాడులు భారత్-పాక్‌ల చర్చల ప్రక్రియను అడ్డుకోలేవన్నారు. ఈ దాడిని శాంతిని వ్యతిరేకించే శత్రువుల మరో దుశ్చర్యగా ప్రధాని అభివర్ణించారు. అమెరికా పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో బుధవారం రాత్రి బసచేసిన ఆయన గురువారం అమెరికా బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇదేరోజు ప్రధాని మన్మోహన్ 81వ పుట్టినరోజు కాగా, ‘ఉగ్ర’దాడుల కారణంగా ఆయన కనీసం కేకునైనా కోయకుండా వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, న్యూయార్క్‌లో ఈనెల 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ కానున్న మన్మోహన్, ఆ సమావేశాన్ని రద్దు చేసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘ఉగ్ర’దాడులకు నిరసనగా శుక్రవారం జమ్మూ బంద్‌కు పిలుపునిచ్చింది. పాక్‌తో చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని, యూపీఏ సర్కారు ఆత్రపడుతున్నట్లు కనిపిస్తోందని, అయితే, ఇలాంటి సమయంలో మెతక వైఖరిని అవలంబించడం ఏమాత్రం తగదని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని ప్రభుత్వం ఆరోపించింది. కాగా, ఉగ్రవాదాన్ని ఉక్కు పిడికిలితో ఎదుర్కొంటామని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఎన్డీఏ హయాంలో కార్గిల్ యుద్ధానికి కారకుడైన అప్పటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్‌ను చర్చలకు ఆహ్వానించిన సంగతిని గుర్తు తెచ్చుకోవాలని హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ బీజేపీకి హితవు పలికారు. జమ్మూలో జరిగిన ‘ఉగ్ర’దాడులు శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నమేనని, బీజేపీ కూడా శాంతిని, చర్చలను వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. శాంతి ప్రక్రియను వ్యతిరేకించే వారే ఉద్దేశపూర్వకంగా ఈ దాడులకు తెగబడ్డారని కాంగ్రెస్ సమాచార విభాగం చైర్మన్ అజయ్ మాకెన్ అన్నారు. బీజేపీ కూడా ఇదే కోరుకుంటోందా అని ఆయన ప్రశ్నించారు. -
జమ్మూలో అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
గత మూడు రోజుల క్రితం రద్దు అయిన అమర్నాథ్ యాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరించామని ఉన్నతాధికారులు మంగళవారం జమ్మూలో వెల్లడించారు. అయితే ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను కొనసాగుతుందని తెలిపారు. అయితే సోమవారం పలు ప్రాంతాల్లో రెండు మూడు గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. దాంతో ఆయా జిల్లాలోని ప్రజలకు పలు కొంతలో కొంత ఉపశమనం కలిగింది. ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిలు శాంతి ర్యాలీలను నిర్వహించారు. అయితే కిష్ట్వార్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని షాలిమార్ చౌక్ వద్ద కొందరు వ్యక్తులు సోమవారం పోలీసుల వాహనానికి నిప్పుంటించారు. ఈ ఘటనకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారందరికి కిష్ట్వార్లో జరిగిన మతఘర్షణలతో సంబంధం ఉందని ఉన్నతాధికారి తెలిపారు. కిష్ట్వార్ జిల్లాలో శుక్రవారం ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, దాదాపు 60 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో శుక్రవారం విధించిన కర్ఫ్యూ మంగళవారం ఐదోరోజుకు చేరింది. అలాగే ఇతర జిల్లాల్లో విధించిన కర్ప్యూ నాలుగో రోజుకు చేరింది.