జనావాసాలపై పాక్ దాడులు | Pakistan attacks on People | Sakshi
Sakshi News home page

జనావాసాలపై పాక్ దాడులు

Published Wed, Nov 2 2016 2:43 AM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM

జనావాసాలపై పాక్ దాడులు - Sakshi

జనావాసాలపై పాక్ దాడులు

- మోర్టారు బాంబులతో ఘాతుకం  
- 8 మంది భారత పౌరుల మృతి.. 22 మందికి గాయాలు
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు
- పాక్ దాడులకు దీటుగా జవాబిచ్చిన భారత ఆర్మీ
- ఇద్దరు రేంజర్ల హతం

సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత్‌ను మరింత కవ్వించేందుకు సామాన్య పౌరులే లక్ష్యంగా మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు నుంచే జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరీ జిల్లాలోని పీవోకే, ఐబీ వెంట మొదలు పెట్టిన దాడిలో 8 మంది పౌరులు మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలున్నారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇంత పెద్దసంఖ్యలో పౌరులు మృతిచెందటం ఇదే తొలిసారి. కాగా సరిహద్దు పరిస్థితిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్ సమీక్షించారు.   

 జమ్మూ: సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు మళ్లీ రెచ్చిపోయాయి. భారత్‌ను మరింత కవ్వించేందుకు సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని మోర్టార్లతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే మొదలుపెట్టిన దాడిలో 8 మంది పౌరులు మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇంతపెద్ద సంఖ్యలో పౌరులు మృతిచెందటం ఇదే తొలిసారి. జమ్మూకశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పీవోకే, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద 120 ఎంఎం, 82 ఎంఎం మోర్టార్‌లతో పాక్ దాడికి దిగిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో పాక్ దాడుల్లో ఐదుగురు మరణించగా.. మరోవ్యక్తి షాక్‌తో మృతిచెందాడని, 9 మంది గాయపడ్డారని తెలిపాయి.

గాయపడిన వారికి రామ్‌గఢ్ ఆస్పత్రిలో ప్రథమచికిత్స చేసి జమ్మూ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజౌరీ జిల్లాలోని మంజాకోటే సరిహద్దు గ్రామంలో ఇద్దరు మహిళలు మోర్టారు దాడుల్లో మృతిచెందగా.. ముగ్గురు ఆర్మీ పోర్టర్లకు కూడా గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. పూంచ్ సెక్టార్లో ముగ్గురు గాయపడ్డారని తెలిపారు. రాజౌరీలో ఉదయం మొదలైన కాల్పులు ఈ మూడు జిల్లాల్లో విస్తరించాయని బీఎస్‌ఎఫ్ డీఐజీ ధర్మేంద్ర పరీక్ వెల్లడించారు. ‘82 ఎంఎం మెర్టార్లతో అడపాదడపా కవ్వించారు. రాజౌరీలోని ఓ చిన్న గ్రామంలో సుల్తాన్ బేగం, మక్బూల్ బేగం అనే ఇద్దరు యువతులు మృతిచెందారు.

పాక్ దాడులకు ఆర్మీ దీటైన సమాధానమిచ్చింది’ అని పరీక్ తెలిపారు. జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్లో ఉదయం 7 గంటలకు జరిగిన మోర్టారు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఉదయం 5.30 నుంచే పాక్ కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. పాక్ దళాలు చిన్న, ఆటోమేటిక్ గన్‌లతో మొదలుపెట్టి.. మోర్టార్లతో దాడికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం నుంచి జరిగిన ఘటనల్లో పౌరులకు తీవ్ర నష్టం జరిగింది’ అని ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా తెలిపారు. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ 60సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. పాక్ కవ్వింపు చర్యలతో అప్రమత్తమైన సర్కారు.. సరిహద్దు వెంబడి గ్రామాల్లోని 174 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది.

 రాజ్‌నాథ్, పరీకర్ సమీక్ష
 సరిహద్దు పరిస్థితిని హోంమంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్ సమీక్షించారు. 8 మంది మృతి, 22 మందికి గాయాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. భేటీలో మంత్రులతోపాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సుహాగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 14 పాక్ పోస్టులు ధ్వంసం
 నియంత్రంణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలకూ భారత ఆర్మీ దీటైన జవాబిచ్చింది. రాజౌరీలోని నౌషెరా సెక్టార్లో ఇద్దరు భారత్ జవాన్లు జరిపిన ఎదురుదాడిలో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అటు జమ్మూలోని ఆర్నియా సెక్టార్‌కు సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారత్ జరిపిన ఎదురుదాడిలో 14 పాక్ పోస్టులు ధ్వంసమయ్యాయని ఆర్మీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement