పాక్‌ను దీటుగా దెబ్బకొడుతున్న సైన్యం!
పాక్‌ను దీటుగా దెబ్బకొడుతున్న సైన్యం!
Published Tue, Nov 1 2016 7:11 PM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM
జమ్మూ: పాకిస్థాన్ సైన్యం పెట్రేగిపోతుండటంతో సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం మంగళవారం విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది భారత పౌరులు ప్రాణాలు విడిచారు. 22 మంది గాయపడ్డారు. దీంతో భారత్ సైన్యం దీటుగా బదులిచ్చింది. మన సైన్యం జరిపిన ప్రతి కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు విడిచారు. సరిహద్దులకు ఆవల ఉన్న 14 పాక్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయి.
పాక్ సైన్యం ఏకపక్షంగా కాల్పులకు దిగుతుండటంతో గతకొన్నాళ్లుగా సరిహద్దులు ఉద్రిక్తంగా మారాయి. ఏ క్షణం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి పాక్ సైన్యాలు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా కాల్పులతో హోరెత్తిస్తున్నాయి. సాంబా, జమ్మూ, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌వోసీ)కు చేరువగా ఉన్న గ్రామాలు, సైనిక పోస్టులు లక్ష్యంగా భారీ తుపాకులతో కాల్పులు ప్రారంభించాయి. దీంతో బీఎస్‌ఎఫ్ బలగాలు కూడా దీటుగా బదులిస్తున్నాయి. బీఎస్‌ఎఫ్ జరిపిన ప్రతి కాల్పుల్లో రామ్‌గఢ్, ఆర్నియా సెక్టర్లలోని 14 పాకిస్థాన్ రేంజర్స్ సైనిక పోస్టులు ధ్వంసమయ్యాయని, ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. మరోవైపు పౌరులను లక్ష్యంగా చేసుకొని పాక్ కాల్పులు చేస్తుండటంతో ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
Advertisement
Advertisement