వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ.. బయటకు కపట నాటకాలాడుతున్న పాకిస్తాన్ నెత్తిన భారీ పిడుగు పడింది. ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ‘సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా?’ అని ట్వీటర్‌లో సోమవారం ఘాటుగా విమర్శించారు.
సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ.. పాక్ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే.. ప్రతిగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ ట్వీట్‌కు సరైన సమాధానమిస్తామని పాక్ ప్రతిస్పందించింది. ఉగ్రవాదంపై ప్రపంచానికి వాస్తవాలు చెబుతామని పేర్కొంది. ట్రంప్ పాక్‌ను హెచ్చరిస్తూ చేసిన ట్వీట్.. ప్రధాని మోదీ దౌత్యనీతి ఫలితమేనని బీజేపీ పేర్కొంది.
ఇదా మీరిచ్చే ప్రతిఫలం!
‘గత 15 ఏళ్లుగా అమెరికా మూర్ఖంగా పాక్‌కు 33 బిలియన్ డాలర్ల సాయాన్నందించింది. కానీ.. దీని ప్రతిగా పాక్ మమ్మల్ని మోసం చేసింది. దొంగలెక్కలు, అబద్ధాలు చెప్పింది. మా నేతలను వాళ్లు మూర్ఖులనుకుంటున్నారు’ అని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామం గా మారింది. అతితక్కువ సాయంతో అఫ్గానిస్తాన్‌లో వేట కొనసాగిస్తున్నాం. ఇకపై ఇలాం టివి సాగవు’ అని ట్రంప్ తొలి ట్వీట్‌లో విమర్శించారు. ఓ అమెరికా అధ్యక్షుడు మిత్రదేశంగా ఉంటూ వస్తున్న పాక్‌పై ఇలాంటి ఘాటు విమర్శలు చేయటం ఇదే తొలిసారి. తన గడ్డపైనుంచి ఉగ్రవాదాన్ని తరిమేసేందుకు పాకిస్తాన్ సుముఖంగా లేని కారణంగా వారికి ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14.3 వేల కోట్లు) సాయాన్ని నిలిపేయాలని అమెరికా భావిస్తోందంటూ వార్తలొస్తున్నాయి.
సయీద్ విషయంలో సీరియస్
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ రెండు నెలల క్రితం విడుదల చేసినప్పుడూ అమెరికా బహిరంగంగానే విమర్శించింది. సయీద్‌ను వెంటనే అరెస్టు చేసి పునర్విచారణ జరపాలని సూచించింది. ఒకవేళపాక్ ఈ అంశంపై స్పందించకుంటే అమెరికా–పాక్ ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం తప్పదని హెచ్చరించింది. తన దక్షిణాసియా పాలసీని ప్రకటించిన ట్రంప్.. ఉగ్రవాదంపై పాక్ తన తీరును మార్చుకోని పక్షంలో కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. ‘మేమింత సాయం చేస్తున్నా.. అమెరికన్లను చంపాలని ప్రతినిత్యం ప్రయ త్నించే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్ర యం కల్పిస్తోంది. ఈ పరిస్థితి తక్షణమే మారాలి’ అని నాడు ట్రంప్ స్పష్టం చేశారు.
రెండు దశాబ్దాలుగా హెచ్చరికలు
పాక్ ఉగ్రస్థావరాలకు స్వర్గధామంగా మారిందనే అంశాన్ని భారత్ పలుమార్లు అంతర్జాతీయ సమాజానికి ఆధారాలతో సహా వెల్లడించింది. అమె రికా కూడా పాక్ ఉగ్ర స్వర్గధామంగా మారిందని ధ్రువీకరించింది. రెండు దశాబ్దాలుగా ఉగ్రకేంద్రాలను నిర్వీర్యం చేయాలని అమెరికా సూచిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తూ వచ్చింది. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇదే అంశంపై పాక్‌కు పలుమార్లు సూచించారు. సుతిమెత్తని హెచ్చరికలు చేశారు. అయినా పాక్ తీరులో మార్పు రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు నేరుగా తుపాకీ ఎక్కుపెట్టారు. క్రిస్మస్‌కు ముందు అఫ్గానిస్తాన్‌లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా.. పాకిస్తాన్ ఉగ్రవాదుల సాయంతో అఫ్గానిస్తాన్, భారత్‌ల అంతర్గత భద్రతకు విఘాతం కల్గిస్తోందని విమర్శించారు.
సరైన సమాధానమిస్తాం: పాక్
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆ దేశ ప్రధాని షాహిద్ అబ్బాసీతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ‘ట్రంప్ ట్వీట్‌కు మేం వీలైనంత త్వరగా సమాధానమిస్తాం. ప్రపంచానికి అసలు నిజాలు తెలియాలి. వాస్తవాలు–కల్పితాల మధ్య తేడాను మేం వివరిస్తాం’ అని సమావేశం అనంతరం ఆసిఫ్ చెప్పారు. అమెరికా సాయం అందుతుందా లేదా అనే అంశాన్ని పక్కనపెట్టి దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే పాక్ ముందుకెళ్లాలని పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా ఖురేషీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోందని.. దీనికి అనుగుణంగా పాక్ విదేశాంగ విధానంలోని లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని విపక్ష పీపీపీ సెనెటర్ షెర్రీ రెహమాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment