భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపిస్తున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ దీనికోసం ప్రత్యేకంగా పవర్‌ప్రెస్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం పాతబస్తీలో దొరికిన కరెన్సీ సైతం అక్కడే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చినట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘భారత్ పవర్ ప్రెస్’లో ముద్రితమవుతున్న ఈ నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉన్నప్పటికీ... మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ను మాత్రం ఐఎస్‌ఐ కాపీ చేయలేకపోయింది.
రూటు మార్చి భారత్‌కు సరఫరా...
క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్‌ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్‌కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలను తరలించే వారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్‌సైన్‌మెంట్స్ వచ్చేవి. గడిచిన కొన్నేళ్ళుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్‌ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది.
క్వాలిటీతో పాటే పెరిగిన ‘కమీషన్’...
నకిలీ కరెన్సీ డంప్ చేసి చెలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్‌ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్ళుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం చిక్కిన కరెన్సీని పాతబస్తీకి చెందిన గౌస్‌కు మాల్దాకు చెందిన బబ్లూ 1:2 రేష్యోలో (రూ.50 వేల అసలు కరెన్సీకి రూ.లక్ష నకిలీ నోట్లు) ఇచ్చినట్లు వెల్లడైంది.
పంథా మార్చిన పోలీసులు...
సాధారణంగా నకిలీ కరెన్సీ కేసుల్ని పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 489 కింద నమోదు చేస్తారు. గౌస్ ఇప్పటికి తొమ్మిదిసార్లు చిక్కగా... ఇదే సెక్షన్ కింద కేసు నమోదు కావడంతో బెయిల్‌పై బయటకు వచ్చి మళ్ళీ దందా ప్రారంభించాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు తొలిసారిగా నకిలీ కరెన్సీ కేసును అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద నమోదు చేశారు. దీంతో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి మార్గం సుగమమైంది. ఇకపై ఈ తరహా కేసుల్ని ఈ చట్ట ప్రకారమే నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే ఇలా నమోదు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న కరెన్సీని విలేకరుల సమావేశంలో బయటకు ప్రదర్శించకూడదు. మరోపక్క 48 గంటల్లో కోర్టు ద్వారా నకిలీ కరెన్సీని మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న భారత పవర్ ప్రెస్‌కు పంపి పరీక్షలు చేయించారు. అక్కడి అధికారులు గరిష్టంగా 15 రోజుల్లోగా కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు ఆ సన్నాహాలు ప్రారంభించారు.