పాక్లో భానుడి ప్రతాపం.. 641మంది మృతి
కరాచీ: మనల్ని మాత్రం ఇప్పటికే చిరుజల్లులు పలుకరించి చల్లటి గాలులు అలుముకుంటుండగా పాకిస్థాన్ను మాత్రం వడగాలులు వణికిస్తున్నాయి. రంజాన్ ప్రారంభమైన గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు వేడిగాలుల వల్ల 630 మందికిపైగా మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా కరాచీ ప్రాంతంలో చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. వెంటనే పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దాల్సిందిగా అధికారులకు అదేశాలు జారీ చేశారు. దాదాపు కొన్న దశాబ్దాల తర్వాత పాకిస్థాన్లో ఇలాంటి పరిస్థితి దాపురించింది.
అక్కడ బాణుడు భగభగ మండిపోతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమాచారం మేరకు మంగళవారం చనిపోయిన మరోపదిమందితో కలిపి వడగాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్య 641కి చేరింది. మితిమీరిన వేడిగాలుల వల్ల వడదెబ్బతగిలి..రక్తపోటు పడిపోతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. కరాచీలో గత శుక్రవారం నుంచి ఇప్పటివరకు వరుసగా 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేలమందికి ఆయా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు.