ఇస్లామాబాద్ : భారత్-పాకిస్తాన్‌ల మధ్య దెబ్బతిన్న సంబంధాల బలోపేతానికి చొరవ తీసుకునేందుకు పాకిస్తాన్ సన్నద్ధమైంది. సార్క్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించింది. సార్క్ సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోదీని పాక్ లాంఛనంగా ఆహ్వానించనుంది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతనిధి మహ్మద్ ఫైసల్ ఈ మేరకు వెల్లడించినట్టు డాన్ పత్రిక పేర్కొంది.
భారత్-పాకిస్తాన్‌ల మధ్య నిర్మాణాత్మక సంప్రదింపుల కోసం పాకిస్తాన్‌కు రావాలని ఆహ్వానిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మోదీకి రాసిన లేఖ నేపథ్యంలో దానికి కొనసాగింపుగా సార్క్ భేటీకి ఆహ్వానించేందుకు పాక్ సంసిద్ధమైంది. ఇమ్రాన్ లేఖలో భారత్‌తో స్నేహపూరిత సంబంధాలకు పాక్ తీసుకుంటున్న చొరవ, ఇరు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి చేపట్టిన కృషిని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
పటిష్ట సార్క్ కోసం వాజ్‌పేయి తపించిన తీరును ఇమ్రాన్ ప్రస్తావించారు. సార్క్ సదస్సులో పాల్గొనడం ద్వారా పాక్‌ను సందర్శించే అవకాశం లభించడంతో పాటు ఇరు దేశాల మధ్య నిలిచిన చర్చల పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతుందని లేఖలో ఇమ్రాన్ పేర్కొన్నారు. కాగా భారత్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులతో 2016లో పాక్ నిర్వహించే సార్క్ సదస్సు నుంచి భారత్ వైదొలగినప్పటి నుంచి ఇంతవరకూ సార్క్ సదస్సు జరగకపోవడం గమనార్హం. భారత్ ఇస్లామాబాద్ సార్క్ భేటీ నుంచి తప్పుకోవడంతో బంగ్లాదేశ్, భూటాన్, ఆప్ఘనిస్తాన్‌లు కూడా వైదొలిగాయి.
Comments
Please login to add a commentAdd a comment