
కరాచీ: మొహర్రం పర్వదినం సందర్భంగా పాకిస్థాన్‌లోని ప్రధాన నగరాల్లో పాల ధరలు ఆకాశాన్నంటాయి. కరాచీ, సింధు ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో లీటరు పాలకు ఏకంగా రూ. 140 వరకు వసూలు చేశారు. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర కన్నా మించి పాల ధరలు పెరిగిపోవడం గమనార్హం. రెండ్రోజుల కిందట పాక్‌లో లీటరు పెట్రోల్‌కు రూ. 113, లీటరు డీజిల్‌కు రూ. 91 ధర ఉంది.
సింధ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో లీటరు పాలకు రూ. 140 వరకు ధర పలికింది. పాలకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో రూ. 120 నుంచి 140కి లీటరు పాలు అమ్మినట్టు ఒక దుకాణదారుడు వెల్లడించినట్టు పాక్ మీడియా తెలిపింది.
మొహర్రం సందర్భంగా జరిగే ఊరేగింపులో పాల్గొనేవారికి సబీల్స్ (స్టాల్స్) ఏర్పాటుచేసి.. ఉచితంగా పాలు, పళ్లరసాలు, తాగునీరు అందిస్తారు. ఇలా సబీల్స్ కోసం పెద్ద ఎత్తున పాల డిమాండ్ ఏర్పడటంతో కరాచీలో పాల ధరలు అమాంతం చుక్కలనంటాయి. పాల ధర నియంత్రణకు కరాచీ కమిషనర్ ఇఫ్తీకార్ షాల్వానీ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ధరలు ఆకాశాన్నంటినా ఆయన పట్టించుకోలేదని పలు పాక్ పత్రికలు పేర్కొన్నాయి. ఇక,కమిషనర్ కార్యాలయంలోనే లీటరు పాలను రూ. 94లకు అమ్మడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment