
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకార దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమనీ, తగిన జవాబిస్తామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ‘పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందిగా భారత నేతలు డిమాండ్ చేస్తుండటాన్ని నేను భారతీయ టీవీ చానళ్లలో చూశాను. భారత్ ప్రతీకార దాడికి దిగితే మేం కూడా దాడి చేస్తాం. యుద్ధం మొదలుపెట్టడమే మన చేతుల్లో ఉంది. ఆపడం కాదు. తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇది పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వమనీ, ఉగ్రవాదులు తమకూ శత్రువులేననీ, తగిన సాక్ష్యాలు అందిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పుల్వామా ఉగ్రవాద దాడికి పాకిస్తానే కారణమనేలా ఏదైనా ఆధారం ఉంటే భారత్ ఇవ్వాలనీ, చర్యలు తీసుకోదగ్గ సాక్ష్యాలను భారత్ సమర్పిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ చెప్పారు. గత గురువారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దాడి చేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి పాకిస్తానే కారణమంటూ అప్పటి నుంచి ఆ దేశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సమాధానంగా ఐదు రోజుల తర్వాత ఇమ్రాన్ తొలిసారిగా స్పంది స్తూ పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. భారత్‌లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్‌ను నిందిస్తే ఓట్లు సులభంగా పడతాయనే భావనతోనే ప్రభుత్వం, పార్టీలు పాక్ పై ఆరోపణలు చేస్తున్నాయని ఇమ్రాన్ నిందించారు. చర్చల కోసం భారత్ సంసిద్ధత వ్యక్తం చేస్తుందని తాను అనుకుంటున్నానన్నారు.
ఉద్రిక్తతలను తగ్గించండి: ఐరాసకు పాక్
పుల్వామా ఉగ్రవాద దాడి కారణంగా ప్రస్తుతం భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)ను పాకిస్తాన్ కోరింది. భారత్, పాక్‌ల మధ్య చర్చలకు చొరవ తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌కు విజ్ఞప్తి చేసింది. ‘పాకిస్తాన్‌పై భారత్ బలాన్ని ప్రయోగిస్తుందనే ఆందోళనలతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విచారణ కూడా చేయకుండానే పుల్వామాలో ఉగ్రవాద దాడికి భారత్ కారణమనడం అర్థరహితం. ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు తీసుకోవడం అనివార్యం. ఇందుకోసం ఐరాస తప్పక రంగంలోకి దిగాలి’ అని ఖురేషీ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే భారత్, పాక్‌ల మధ్య మూడో దేశం లేదా సంస్థ జోక్యాన్ని భారత్ తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఏ సమస్యైనా ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలంటోంది.
చర్చల ద్వారా పరిష్కరించుకోండి: చైనా
పుల్వామా ఉగ్రవాద దాడి కారణంగా భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాలూ సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి చేసింది. సమస్యలను ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది.
ఎప్పుడూ చెప్పే మాటలే: భారత్
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించింది. భారత్‌లో ఉగ్రవాద దాడులకు, పాకిస్తాన్‌కు సంబంధం లేదనే వాదన ‘ఉగ్రవాద మూల కేంద్రం (పాకిస్తాన్)’ ఎప్పుడూ చేసేదేనని భారత్ పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘పుల్వామాలో జరిగింది ఉగ్రవాద దాడేనని ఇమ్రాన్ ఒప్పుకోకపోవడం భారత్‌కు ఏ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడూ చెప్పేది అదే. ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటాం అనడం ఓ బూటకం. స్వయంగా ఈ దాడికి పాల్ప డిన ఉగ్రవాది మాటలను, దాడి తామే చేసినట్లు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించడాన్ని ఇమ్రాన్ పక్కనబెట్టారు. జైషే సంస్థ పాకిస్తాన్ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తోందనీ, దాని చీఫ్ మసూద్ అజార్ పాక్‌లోనే ఉన్నాడన్న విషయం ప్రపంచమంతటికీ తెలిసిందే. చర్యలు తీసుకోడానికి పాక్‌కు ఇంతకంటే ఏం ఆధారాలు కావాలి’అని విదేశాంగ శాఖ ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment