పాకిస్థాన్ లో హిందువులకు తీపికబురు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులకు తీపి కబురు అందింది. హోలి, దీపావళి, ఈస్టర్ పండులకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మంగళవారం ఒక తీర్మానం ఆమోదించింది. 'మైనారిటీల కోసం హోలి, దీపావళి, ఈస్టర్ పర్వదినాలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఈ సభ కోరుతోంది' అని తీర్మానం చేసింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ నేత రమేశ్ కుమార్ వంక్వానీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ముస్లింమేతర పండుగలకు మైనారిటీలకు సెలవులు మంజూరు చేసేందుకు సమాఖ్య వ్యవస్థలు, వివిధ విభాగాలు, సంస్థల ప్రధానాధికారులకు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని మతవ్యవహారాల శాఖ మంత్రి పిర్ అమినుల్ హస్నాత్ షా తెలిపారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి ప్రభుత్వం కట్టుబడితే హోలి, దీపావళి, ఈస్టర్ పండులకు సెలవు ప్రకటిస్తూ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేయనుంది.