
చివరి రోజుల్లో.. మరచిపోలేని సర్ ప్రైజ్
బ్రాంటన్ (యూకే) :
వారసత్వంగా వచ్చిన గుర్రాల పెంపకం అంటే యూకేలోని బ్రాంటన్కు చెందిన పాట్రిక్ సాండర్స్(87)కి మక్కువ ఎక్కువ. తన జీవన విధానంలోనే గుర్రాలు కూడా ఓ భాగంగా అయ్యాయి. ఎన్నో ఏళ్లుగా గుర్రాల స్వారీని ఎంతో మందికి నేర్పించాడు. అయితే జీవిత చరమాంక దశలో నార్త్ దేవాన్ హాస్పయిస్ కేర్(మరణానికి అంచున ఉన్న రోగులను అక్కున చేర్చుకుని సేవలందించే సంస్థ)లో చేరాడు. అక్కడ ఉన్నన్ని రోజులు నర్సులకు తనకు గుర్రాలపై ఉన్న ఇష్టం గురించి, వాటికి ఆహారాన్ని అందించడం దగ్గరనుంచి స్వారీ చేయడం వరకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. దీంతో అక్కడి సిబ్బంది పాట్రిక్కి అతని చివరి రోజుల్లో మరచిపోలేని సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు.
స్థానికంగా ఉన్న ఓ గుర్రపుశాలను సంప్రదించి విక్టర్ అనే గుర్రాన్ని పాట్రిక్ కలిసేలా ఏర్పాట్లు చేశారు. గుర్రాన్ని తీసుకువచ్చిన రోజు పాట్రిక్ ఆరోగ్యం పూర్తిగా క్షిణించి, బెడ్ పై నుంచి కూడా అడుగు కిందపెట్టలేక పోయాడు. దీంతో అక్కడి స్టాఫ్ ఎలాగైనా పాట్రిక్కి చివరి రోజుల్లో అతని కోరిక నెరవేర్చాలని ఏకంగా బెడ్నే బయటకు తీసుకు వచ్చారు. 'గుర్రాలపై పాట్రిక్కు ఉన్న ప్రేమ ఆయన మాటల్లో చాలా స్పష్టంగా తెలిసేది. అతని జీవితంలో గుర్రాల పాత్ర చాలా ఎక్కువ. అతని కోసం గుర్రాన్ని తీసుకువచ్చినప్పుడు పాట్రిక్ కళ్లల్లో కనిపించిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేను. రోగుల జీవితంలో మరిన్ని రోజులనైతే కలపలేము, కానీ జీవిత చరమాంక దశలో మిగిలిన రోజులను ఆనందంతో నింపడానికి మా వంతు ప్రయత్నిస్తాము' అని కేర్లో పని చేస్తున్న నర్స్ కాథీ వతిహామ్ పేర్కొన్నారు. పాట్రిక్ బెడ్పైనుంచే గుర్రాన్ని చూసి పట్టలేని సంతోషంతో సేపులు, క్యారెట్, పోలో మింట్లను తన చేతులతో ప్రేమగా తినిపించాడు. ఇది జరిగిన మూడు రోజులకే పాట్రిక్ మృతి చెందాడు.
'గుర్రాలతో మా కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మా తండ్రి దగ్గరికి గుర్రాన్ని తీసుకువస్తున్నారని తెలిసినప్పడు, బాల్కనీలో నుంచి గుర్రాన్ని చూపిస్తారేమోనని అనుకున్నా. కానీ, మా నాన్న చివరి రోజుల్లో అంత దగ్గర నుంచి గుర్రానికి ఆహారం పెట్టించడం నేను ఎప్పటికీ మరచిపోలేను. హాస్పయిస్ కేర్ సభ్యులు మా నాన్నకి అంత మంచి అనుభూతులని అందిస్తారని అనుకోలేదు. మా నాన్న చివరి రోజుల్లో ఆయనకు ఎంతో ఇష్టమైన గుర్రాన్ని తీసుకువచ్చి ఎనలేని ఆనందాన్నిచ్చారు. ఆరోజు మా తండ్రికి ఎంతో స్పెషల్' అని పాట్రిక్ కూతురు జేన్ అన్నారు.