పెంటగాన్‌లో భారత్ కు ప్రత్యేక సెల్
అమెరికా రక్షణ శాఖ.. భారత్ కు ఒక అరుదైన గుర్తింపు నిచ్చింది. ఆదేశ రక్షణ కార్యాలయం పెంటగాన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒక దేశం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయడం.. పెంటగాన్ చరిత్రలోనే తొలిసారి.
భారత్ తో తన రక్షణ, వాణిజ్య, టెక్నాలజీ సంబంధాలను విసృత పరుచుకునే దిశగా.. ఈ సెల్ ఒక ముందడుగని అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ అభిప్రాయపడ్డారు. వీటితో పాటు... హైటెక్ మిలిటరీ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం.. సంయుక్తంగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విభాగంలో అమెరికా రక్షణ శాఖలో వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు అధికారులు పనిచేస్తున్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ వాణిజ్యం, టెక్నాలజీ ఒప్పందం కింద తాము చేపట్టిన పనులను వేగ వంతం చేస్తున్నామని.. ఏ పనైనా సరే మూడు నెలల్లో పూర్తి అయ్యేలా ఈ ర్యాపిడ్ యాక్షన్ సెల్ పనిచేస్తుందని తెలిపారు. దీని ద్వారా భారత్-అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరనున్నాయి. గతంలో ఒప్పందం అమలుకు ఏడాదిన్నరనుంచి మూడేళ్ల సమయం పట్టేది. అయితే ఇప్పుడు కేవలం మూడు నెలల్లోనే ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని వెబ్‌స్టర్ చెప్పారు. ఇన్నాళ్లు పాకిస్థాన్‌కు సపోర్ట్ గా ఉన్న అమెరికా.. ఇటీవల భారత్ సైడ్ తీసుకుంది. ముఖ్యంగా చైనా మార్కెట్ ను దెబ్బ తీయాలంటే.. దానికి ధీటైన మార్కెట్ భారత్ లోనే ఉందని అమెరికా భావిస్తోంది. అందువల్లే.. భారత్‌ను వాణిజ్య పరంగా అమెరికా అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒబామా, మోడీ మధ్య జరగబోయే చర్చల్లో రక్షణ, వ్యూహాత్మక సహకారం కీలక అంశంగా మారనుంది.