స్మార్ట్ ఫోన్తో చిత్తవుతారు జాగ్రత్త!
వాషింగ్టన్: మీకు సెల్ ఫోన్ ఉందా అనే మాట మరీ పాతదై పోయి.. మీకు స్మార్ట్ ఫోన్ ఇంకా లేదా అనేంత కొత్త రోజులొచ్చాయి. ఇవి ఏ ఒక్క పట్టణానికో అంటే పొరపడ్డట్లే ఎందుకంటే.. గ్రామాల్లో కూడా వీధివీధిన స్మార్ట్ ఫోన్ల వీర విహారం చూస్తున్నాం. అయితే, వీటి వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు తీరుతున్నాయోకానీ, మానసికంగా మాత్రం బలహీనమైపోతారని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అదేపనిగా రోజంతా స్మార్ట్ ఫోన్లలో తలలు దూర్చి తెగ చూస్తుండిపోయేవారిలో సహజంగానే అసహనం, తొందరపాటు అనే అవలక్షణాలు అలవోకగా వచ్చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం వారు దాదాపు 91మంది యువకులను తమ పరిశీలనకు తీసుకున్నారు. వారిలో ఎక్కువసేపు వీటిని ఉపయోగించేవారిని, తక్కువ సేపు ఉపయోగించేవారిని పలు రకాలుగా పరీక్షించారు. ఇందులో అతిగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారు చిరాకుగా ఉండటమేకాకుండా, చిందరంవందరగా ఉంటూ స్థిమితంగా లేకుండా ప్రవర్తించారట. ఇక తక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వాడేవారు మాత్రం అలా చేయలేదని స్పష్టం చేశారు.