పైలట్ చాకచక్యం
ఇంజన్‌లో మంటలు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో 97 మందితో వెళుతున్న విమానం మంగళవారం ప్రమాదానికి గురైంది. విమానంలోని ఒక ఇంజన్‌లో ఆకస్మికంగా మంటలు లేచాయి. పైలట్ వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రిటిష్ ఎయిరోస్పేస్‌కు చెందిన బీఏఈ 146 జెట్ విమానం 92 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ముగ్గురు కేబిన్ సిబ్బందితో పెర్త్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది.
ఇది పశ్చిమ ప్రాంతంలోని బారో ఐలాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానంలోని నాలుగు ఇంజన్లలో ఒకదానిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా, పైలట్ వెంటనే ఆ ఇంజన్‌ను ఆపివేయడంతో మంటలు చల్లారాయని, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని కోబమ్ ఏవియేషన్ సర్వీసెస్ వెల్లడించింది.