ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఇప్పుడు స్వర్గధామం కాదని దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. అఫ్గానిస్తాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌లో శాంతినెలకొనాలని పాకిస్తాన్ కోరుకుంటోందని, పొరుగు దేశంలో అస్థిరత ఉండాలని ఎలా కోరుకుంటామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మనీలాండరింగ్ నిరోధక సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పారిస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని అడ్డుకునేందుకు పాక్ చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలతో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంపై ఈ సమావేశం జరగనుంది.
భారత్ విధానాలతో సంక్షోభం
భారత్‌లో ప్రస్తుతమున్న పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం తగిన చర్యలు తీసుకోక పోతే పాకిస్తాన్ శరణార్థుల రూపంలో మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ‘హద్దుమీరిన జాతీయవాద సిద్ధాంతం వినాశనానికి దారితీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. భారత్ తలచుకుంటే పాకిస్తాన్‌ను 11 రోజుల్లో నాశనం చేయగలదు అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment