కండోమ్‌లు ఓకే.. గర్భస్రావం వద్దు!
జికా వైరస్ వస్తుందన్న భయం ఉన్న మహిళలు కావాలంటే కండోమ్‌ల లాంటి కృత్రిమ గర్భనిరోధక పద్ధతులు వాడొచ్చు గానీ, ఆ పేరు చెప్పి గర్భస్రావానికి వెళ్లడం మాత్రం సరికాదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గర్భస్రావం ఒక్కటే మార్గం అనడాన్ని ఆయన నిర్మొహమాటంగా ఖండించారు. 1960 ప్రాంతాల్లో బెల్జియన్ కాంగో ప్రాంతంలో కొంతమంది నన్‌లపై పదేపదే అత్యాచారాలు జరిగేవని, వాళ్లు గర్భం ధరించకుండా ఉండేందుకు కృత్రిమ గర్భనిరోధ పద్ధతులు పాటించాల్సిందిగా అప్పట్లో పోప్ పాల్ -6 చెప్పిన విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ గుర్తుచేశారు.
అబార్షన్లు మానవాళికే మంచివి కావని, అయితే గర్భం రాకుండా ఆపడం మాత్రం తప్పు కాదని ఆయన చెప్పారు. జికా లాంటి సందర్భాలలో అయితే పోప్ పాల్ 6 సూచించిన మార్గాన్ని అనుసరించడం మంచిదని తెలిపారు. గర్భిణులకు ఎక్కువగా సోకుతున్న జికా వైరస్ కారణంగా పుట్టబోయే శిశువులకు కూడా లోపాలు ఉంటున్నాయన్న కారణంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వవ్యాప్త ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.