లండన్ : కరోనా మహమ్మారితో గడగడలాడుతున్న ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు చూపుతోందని తెలిపింది. వర్సిటీ అస్ట్రాజెనెకాతో కలిసి రూపొందించిన కరోనా టీకా ఒకటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. బ్రిటన్‌లోని ఐదు ఆస్పత్రుల్లో 18–55 ఏళ్ల మధ్యనున్న 1,107 మంది ఆరోగ్య వంతులపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్‌ను నిరోధించేలా వ్యాధినిరోధకతను పెంచే యాంటీబాడీలు, టీ సెల్స్ పెరిగినట్లు గుర్తించినట్లు వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు సోమవారం లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో చేపట్టిన సార్స్–కోవ్–2 వ్యాక్సిన్ ట్రయల్స్ సందర్భంగా తీవ్రమైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని వ్యాక్సిన్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. రెండో బూస్టర్ డోస్ టీకా ఇచ్చిన పది మందిలోనూ వ్యాధి నిరోధకత స్థాయిలు మరింత పెరిగినట్లు గుర్తించామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఆడ్రియన్ హిల్ చెప్పారు.
ఈ ఏడాది చివరి నాటికి..
టీకాను ప్రజల వినియోగార్ధం విడుదల చేసే విషయం అన్ని సమీక్షలు పూర్తయ్యాక ఈ ఏడాది చివరి నాటికి నిర్ధారణవుతుందని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్, ఔషధ సంస్థ అస్ట్రా జెనెకాతో సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా తయారీకి సిద్ధంగా ఉందనీ, అస్ట్రా జెనెకా ఇప్పటికే 200 కోట్ల డోసుల టీకా తయారీకి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. తమ టీకా కోవిడ్ నుంచి సంపూర్ణంగా రక్షణ ఇస్తుందని నిరూపించడమే తదుపరి లక్ష్యమన్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లకు చెందిన సుమారు 10వేల మందిపై చేపట్టిన ప్రయోగాల ఫలితాలపై సమీక్ష కొనసాగుతోందన్నారు. త్వరలోనే అమెరికాలో భారీ స్థాయిలో 30 వేల మందిపై ప్రయోగాలు చేపట్టనున్నట్లు వివరించారు. టీకా లేకుండా వైరస్ నియంత్రణ కష్టమన్నారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఈ పరిశోధనలతో సంబంధం లేని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎరిక్ ఫైగిల్–డింగ్ అన్నారు.
భారత్‌లోనూ పరీక్షలు!
క్లినికల్ ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నందున, త్వరలో భారత్‌లోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కేంద్రానికి దరఖాస్తు చేసుకుంటామని పుణేకు చెందిన సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే ట్రయల్స్ మొదలు పెడతామంది. వ్యాక్సిన్‌కు తుది అనుమతులు లభించక మునుపే భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి, విడుదలకు సిద్ధంగా ఉంచుతామని గతంలోనే సంస్థ ప్రకటించింది.
వచ్చే నెలలోనే రష్యా టీకా!
మాస్కో : రష్యా తయారీ కోవిడ్ టీకా త్వరగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, వచ్చే నెలలోనే మార్కెట్‌లోకి విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొ దటిసారిగా తాము విడుదల చేస్తున్న వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైందని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈ టీకా ఒకసారి వేసుకుంటే రెండేళ్లపాటు కరోనా నుంచి రక్షణ ఇస్తుందని పేర్కొంది. ‘సెచెనెవ్ యూనివర్సిటీ తయారీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 20వ తేదీన బుర్డెంకో ఆస్పత్రిలో పూర్తయ్యాయి. పరిశోధనలు ఇంకా ముగియనప్పటికీ ఫలితాలు సానుకూలంగా వచ్చాయి’ అని రష్యా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ అధిపతి సెర్గీ బోరిసేవిచ్ తెలిపారని అక్కడి మీడియా వెల్లడించింది. చివరి, మూడో క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక మునుపే టీకా ను విడుదల చేయనున్నట్లు రష్యా ఆరోగ్య మంత్రి తెలిపారు. దేశీయంగా 3 కోట్ల డోసులు, విదేశాల్లో 17 కోట్ల డోసుల్ని తయారు చేస్తామని రష్యా ఇప్పటికే తెలిపింది. ఈ వ్యాక్సిన్ తయారీకి 5 దేశాలు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంది. చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఆగస్టు 3న రష్యాతోపాటు సౌదీ, యూఏఈల్లో చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment