లైంగిక చర్యతో కూడా జికా వ్యాప్తి!
న్యూయార్క్: జికా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. ప్రెగ్నెన్సీ మహిళలు దీని బారిన పడితే వారికి పుట్టే పిల్లల్లో తల పరిమాణం చిన్నదిగా ఉండి మెదడుకు సంబంధించిన ఎదుగుల తక్కువగా ఉంటోంది ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల కాలంలో జికా వైరస్ ప్రభావానికి గురైతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఇప్పటివరకూ జికా వైరస్ దోమ కాటు ద్వారానే వ్యాప్తి చెందుతుందని భావిస్తూ వచ్చారు. ఎడీస్ ఈజిప్టి దోమ జికా వైరస్ను వ్యాప్తి చెస్తోంది. అయితే లైంగిక చర్య ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జికా వైరస్ బారినపడిన ఓ వ్యక్తి రక్తంతో పాటు వీర్యం శాంపిల్స్లో కూడా రెండు వారాల పాటు వైరస్ ఉనికిని గుర్తించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఈ విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాల్లో ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. బ్రెజిల్లో జికా వైరస్ విజృంభిస్తుండటంతో రియో ఒలంపిక్స్పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. పలు దేశాలు తమ మహిళా క్రీడాకారిణిలను బ్రెజిల్ పంపడానికి సందిగ్ధంలో పడ్డాయి. అయితే ఒలంపిక్స్ నాటికి జికాను అదుపులోకి తెస్తామని బ్రెజిల్ చెబుతోంది. భారత్లో డెంగీ వ్యాప్తి చేసే ఎడీస్ దోమలకు కొదువలేదు. ఈ దోమలే జికా వైరస్నూ వ్యాప్తి చెందిస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.