జపాన్‌కు భారీ టైఫూన్ దెబ్బ
అత్యంత శక్తిమంతమైన చాబా అనే టైఫూన్ ఒకటి జపాన్ వైపు వేగంగా దూసుకొస్తోంది. దాంతో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణ కొరియాలోని ఒక రిసార్ట్ దీవిని తాకిన ఈ టైఫూన్.. అక్కడ విధ్వంసం సృష్టించడంతో ఇప్పటికే పలు విమానాలు రద్దయ్యాయి, వీధుల్లో వరద ఉప్పొంగుతోంది. ప్రస్తుతం ఇది జపాన్‌లోని త్సుషిమా నగరానికి ఉత్తర ఈశాన్యంగా వస్తోందని, దీనిప్రభావంతో గంటకు 180 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని జపాన్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావం వల్ల భారీ వర్షాలతో పాటు అలలు కూడా పెద్ద ఎత్తున ఎగుస్తాయని, వరదలు వస్తాయని, జపాన్ పశ్చిమభాగంలోని చాలా ప్రాంతం అల్లాడుతుందని అంటున్నారు.
జపాన్‌లోని ప్రధాన ప్రాంతమైన హొన్షును బుధవారం సాయంత్రానికి ఇది తాకొచ్చని, తర్వాత పసిఫిక్ సముద్రంవైపు వెళ్తుందని వెదర్ జపాన్ పేర్కొంది. బుధవారం తెల్లవారుజామున ఇది దక్షిణ కొరియాలోని రిసార్ట్ దీవి జెజును తాకింది. దాంతో అక్కడ భారీ వర్షాలు, వరదలు వచ్చాయి. ఫలితంగా జెజుకు వచ్చే, అక్కడినుంచి వెళ్లే విమానాలను రద్దుచేశారు. చైనా పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. జెజు దీవలోని 25 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుసాన్ నగరంలోని 900 పాఠశాలలను మూసేశారు. ఒడ్డున నిలిపి ఉంచిన ఒక ఫెర్రీలో ఉన్న ఆరుగురు సిబ్బందిని ఓ భారీ కెరటం సముద్రంలోకి లాక్కెళ్లిపోతున్న దృశ్యాలను వైటీఎన్ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. అయితే తర్వాత ఆ ఆరుగురిని సహాయక సిబ్బంది రక్షించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)