బీజింగ్: ఆసియా పర్యటనలో భాగంగా చైనా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఘన స్వాగతం లభించింది. బుధవారం బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు చైనా అధికార పార్టీ నాయకులు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలకగా, చైనా ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. ఆ తరువాత చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ట్రంప్ దంపతులకు చారిత్రక ‘ఫర్‌బిడెన్ సిటీ’ ప్యాలెస్‌లో ఆతిథ్యమిచ్చారు. అక్కడికి చేరుకున్న ట్రంప్ దంపతులకు జిన్‌పింగ్ దంపతులు స్వాగతం పలికారు. ట్రంప్ దంపతుల గౌరవార్థం చైనా సాంస్కృతిక కార్యక్రమం పెకింగ్ ఒపేరా నిర్వహించారు.
చైనా గణతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచి ఏ విదేశీ అధ్యక్షుడికి కూడా ఈ చారిత్రక ప్యాలెస్‌లో ఇలాంటి గౌరవం దక్కలేదని సీఎన్‌ఎన్ పేర్కొంది. గురువారం ట్రంప్ జిన్‌పింగ్‌తో అధికారికంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా వారు ఉ.కొరియా అణు ముప్పు, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై చర్చలు జరిపే అవకాశముంది. చైనా అధికారిక భాష మాండరిన్‌లో ప్రావీణ్యం సంపాదించిన ఇవాంకా, కుష్నర్‌ల ఆరేళ్ల కూతురు అరబెల్లాకు జిన్‌పింగ్ ఏ గ్రేడ్ ఇచ్చారు. తన మనవరాలు అరబెల్లా మాండరిన్‌లో పాట పాడుతున్న ఓ వీడియోను ట్రంప్ జిన్‌పింగ్‌కు చూపారు. తమ భాషపై పట్టు సాధించిన అరబెల్లాను చైనా అధ్యక్షుడు ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment