మ్యూజియంగా మారనున్న 'ప్రిన్స్' హోమ్
లాస్ ఏంజెలెస్ః పాప్ గాత్రంతో అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ గాయకుడు ప్రిన్స్ ఎస్టేట్... త్వరలో మ్యూజియంగా మారబోతోంది. 1980 లో స్వంత ఆల్బమ్స్ తో మొదలైన ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ ప్రస్థానం... ఆయన్ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చేసింది. 57 ఏళ్ళ వయసులో 21 ఏప్రిల్ 2016 న ప్రిన్స్ మినెసోట్టోలోని ఆయన స్వగృహంలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు ఆయన స్మారకార్థం సంగీత ప్రియులకు గుర్తుండిపోయేలా ఆయన నివసించిన పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చేందుకు నిర్ణయించారు.
'పర్పుల్ రైన్' హిట్ మేకర్ ప్రిన్స్... తన పాప్ గానంతో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. దీంతో ఆయన హఠాన్మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ అభిమాన గాయకుడు, మ్యూజిక్ లెజెండ్ ఫ్యాన్స్ మమనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు గుర్తుగా ప్రిన్స్ నివసించిన గృహం 'పైస్లే పార్క్ ఎస్టేట్' ను ఆయన స్మారక చిహ్నంగా మార్చేందుకు నిర్ణయించినట్లుగా ఎటోన్ లైన్ డాట్ కామ్ నివేదించింది. ప్రిన్స్ సంగీతానికి జ్ఞాపక చిహ్నంగా పైస్లే పార్క్ ఎస్టేట్... ను మార్చనున్నట్లు ఆయన బంధువు ఫిలిప్స్ కూడ ఓ పత్రికకు తెలిపారు. అయితే తన నివాస గృహాన్ని మ్యూజియంగా మార్చాలన్న కోరిక ప్రిన్స్ కు ముందే ఉండేదని, అదే ఆలోచనతో ఆయన మరణించక ముందే ప్రిజర్వేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రిన్స్ సహాయకురాలు, మాజీ ప్రేమికురాలు షెయీలా ఓ పోస్ట్ లో వివరించారు. దాంతో పైస్లే పార్క్ ఎస్టేట్ ను మ్యూజియంగా మార్చే పనులు కొనసాగించి ఆయన కోరికను తీర్చే ప్రయత్నం చేస్తామని ఆమె వివరించారు.
ప్రిన్స్ సంగీతం ఎప్పటికీ నిలిచిపోవాలన్న ఆలోచనలో ఉండేవారని అందుకే తన ఇంటిని మ్యూజియంగా మార్చేందుకు సిద్ధ పడ్డారని, ఈ నేపథ్యంలో ఆయన డ్రమ్స్, మోటార్ సైకిల్ వంటి కొన్ని వస్తువులను సైతం సేకరించి పెట్టారని షెయీలా తెలిపారు. వచ్చిన అవార్డులు, రివార్డులపై ఆయనకు పెద్దగా శ్రద్ధ లేకపోయినా, ఫ్యాన్స్ నుంచి తనకు అందిన అభిమానానికి గుర్తుగా, వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరికతో వాటన్నింటిని ప్రిన్స్ హాలులో భద్రంగా ప్రదర్శనకు పెట్టారని షెయీలా తెలిపారు.