వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేయడానికి ఉపకరించే హెచ్–1బీ వీసా విధానంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తీసుకొస్తున్న ఓ ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది. ‘అమెరికా వస్తువులనే కొనండి. అమెరికా జాతీయులనే ఉద్యోగాల్లో నియమించుకోండి’ అన్న ట్రంప్ నినాదానికి అనుగుణంగా ఆ దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హెచ్–1బీ వీసాల విధానంలో ఈ కొత్త సవరణను ప్రతిపాదిస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం హెచ్–1బీ వీసా ఉన్న వారు గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో...ఒకవేళ గ్రీన్ కార్డు అప్లికేషన్ పరిశీలనలో ఉండగానే హెచ్–1బీ వీసా గడువు ముగిసిపోతే అప్పుడు గ్రీన్‌కార్డుపై నిర్ణయం వెలువడే వరకు వీసా గడువును పొడిగిస్తారు.
ఇకపై ఈ విధానాన్ని కొనసాగించకూడదనీ, హెచ్–1బీ వీసా కలిగిన వారు గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ...గ్రీన్‌కార్డు మంజూరవడానికి ముందే వీసా గడువు పూర్తయితే అలాంటి వారిని స్వదేశాలకు పంపించేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. భారత ఐటీ కంపెనీలు ఏటా అధిక సంఖ్యలో హెచ్–1బీ వీసాలను సంపాదించి అమెరికాలో తమ కార్యకలాపాల కోసం ఇక్కడి నుంచే ఉద్యోగులను తరలిస్తుండటం తెలిసిందే. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న 5 లక్షల నుంచి ఏడున్నర లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వారంతా గ్రీన్‌కార్డుకు దర ఖాస్తు చేసుకున్నా, వీసా గడువు ముగిసేలోపు అది మంజూరవ్వకపోతే మన దేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసాల జారీ, కొనసాగింపు నిబంధనలను ట్రంప్ యంత్రాంగం ఒక్కొక్కటిగా కఠినం చేస్తుండటం తెలిసిందే.
ఎందుకీ ప్రతిపాదన?
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే వీసా గడువు ముగిసిన విదేశీ ఉద్యోగులు అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. వారందరి ఉద్యోగాలూ ఖాళీ అవుతాయి కాబట్టి ఆ కొలువులు అమెరికా జాతీయులకే దక్కుతాయనేది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. విదేశీయులు ‘కొల్లగొడుతున్న’ ఉద్యోగాలను మళ్లీ అమెరికన్లకే ఇప్పిస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్రంప్...ఆ మాటను నిలబెట్టుకునేందుకే మొదటి నుంచి హెచ్–1బీ వీసాలపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment