సియోల్ : ఇవాళ దక్షిణ కొరియాలో ‘డాగ్ మీట్ డే’. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? చనిపోయిన చిన్న కుక్కపిల్లను పట్టుకొని దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని పార్లమెంటు ముందర ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని వెనక నిలబడి కొందరు గట్టిగా నినాదాలు చేస్తున్నారు. పార్లమెంటుకు సమీపంలోనే మరి కొంతమంది వీరికి వ్యతిరేకంగా ఇంకా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఇలా నినాదాలు, ప్రతి నినాదాలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తింది. దీనికి కారణం ‘డాగ్ మీట్ డే’. కుక్క మాంసాన్ని వండుకుని తినే సంప్రదాయ దినోత్సవం ‘బొక్నాల్’ను డాగ్ మీట్ డే గా జరుపుకుంటారు కొరియన్లు. అందుకే ఒకపక్క కుక్కల మాంసం నిషేధించాలని జంతుప్రేమికులు పోరాడుతుంటే.. ఏంటి? మమ్మల్నే తినొద్దంటారా? కుక్క మాంసం తినడం మా సంస్కృతిలో భాగం, మీరెవరు తినొద్దని చెప్పడానికి అంటూ స్థానిక కొరియన్లు వీరిని కసురుకుంటున్నారు.
అయితే ఈ నిరసనలో జంతుప్రేమికురాలు, అమెరికన్ నటి కిమ్ బాసింగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లాస్ట్ చాన్స్ ఫర్ యానిమల్స్ గ్రూపు సభ్యులతో కలసి కుక్కల మాంస పరిశ్రమను కొరియాలో నిషేధించాలని గట్టిగా కోరారు. జంతు హింసకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్న కిమ్ బాసింగర్ కొరియాకు రావడం మాత్రం ఇదే తొలిసారి. ‘ఏదైనా మార్పు ఒక్కసారిగా సంభవించదని, కొరియన్లు మార్పును అంగీకరిస్తారని’ ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. కుక్కలు తినొద్దు ప్లీజ్ అంటూ కొరియన్లను అభ్యర్థించారు.
అయితే కొరియన్లు మాత్రం కుక్క మాంసం తినే దినోత్సవం ‘బొక్నాల్’ రోజునే ఈ నిరసనలు జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, చర్మం స్మూత్‌గా తయారవుతుందని, వయసు కనిపించదని, చాలా రకాల వ్యాధులు దరిచేరవని వీరి విశ్వాసం. గత సంవత్సరం కూడా అతిపెద్ద కుక్క మాంసం ప్రదర్శనను నిలిపివేయడంలో జంతుప్రేమికులు విజయం సాధించారు. కరెంటు షాక్ ఇచ్చి మరీ పెద్ద ఎత్తున కుక్కలను చంపుతున్నారంటూ ఆరోపించడంతో ప్రభుత్వం ఈ ప్రదర్శనను రద్దుచేసింది. అప్పుడే ఆగ్రహంగా ఉన్న వీరు తాజాగా సంప్రదాయ ‘డాగ్ మీట్ డే’ న కూడా అడ్డుతగులడంతో రోడ్డుపైనే మాంసాన్ని తింటూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇది మా సంప్రదాయం. కొరియాలో చాలా మంది పేదవారు ఉన్నారు. వారికి తక్కువ ఖర్చులో ప్రొటీన్స్ దొరకడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
2018లో నిర్వహించిన ఓ సర్వేలో 44 శాతం మంది కుక్కలను చంపడాన్ని వ్యతిరేకించగా, 43 శాతం మంది మాకు కుక్క మాంసం కావాలని కోరారు. 2017లో మాత్రం కుక్కమాంసం కావాలని కోరిన వారే ఎక్కువ. ఇప్పుడు వీరి శాతం తగ్గడంతో ఏదో ఒక రోజు కొరియాలో కుక్కలు వీధుల్లో ప్రశాంతగా తిరిగే రోజు చూస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతుప్రేమికులు. ఇప్పటికే కుక్కలను చంపడాన్ని నేరంగా ప్రకటించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందడానికి పార్లమెంటులో సరైన మద్దతు లభించట్లేదు. విచిత్రం ఏమంటే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ జంతుప్రేమికుడు. దీనిపై స్పందించిన ఆయన కుక్క మాంసం తినడం అనేది వ్యక్తిగతమని పేర్కొన్నారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లుపై మాట్లాడకుండా సభ్యులపై కుక్క మాంస వ్యాపారస్తులు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట.
Comments
Please login to add a commentAdd a comment