
కిమ్‌తో యాంగ్ కరచాలనం
సియోల్: దేశ రక్షణకు పూచీ ఇస్తే అణ్వాయుధాలను త్యజించేందుకు ఉత్తరకొరియా ముందుకువచ్చింది. దీంతోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు కూడా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సంసిద్ధత తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ జాతీయ భద్రతా సలహాదారు చుంగ్–ఇయు–యాంగ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల ఉ.కొరియా వెళ్లింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ బృందం సమావేశమైంది.
మంగళవారం తిరిగి స్వదేశానికి చేరుకున్న ఈ బృందం చర్చల ఫలితాలను వెల్లడించింది. ఉ.కొరియాతో చర్చల్లో గణనీయ పురోగతి కనిపించిందని పేర్కొంది. సరిహద్దు గ్రామం పన్‌మున్‌జోంలో ఏప్రిల్‌లో రెండు దేశాల అధ్యక్షుల సమావేశానికి అంగీకారం కుదిరిందని తెలిపింది. తమపై సైనిక పరమైన ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసి, ప్రభుత్వ మనుగడకు గ్యారెంటీ ఇచ్చిన పక్షంలో అణ్వాయుధాలను, క్షిపణులను కలిగి ఉండటంలో అర్థం లేదని, వాటిని త్యజిస్తామని ఉత్తరకొరియా పాలకుడు చెప్పినట్లు యాంగ్ వెల్లడించారు. తాము ఎలాంటి అణు, మిస్సైల్ పరీక్షలు జరుపబోమని ఉత్తరకొరియా హామీ ఇచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment