Moon Jay In
-
కుక్క మాంసం తినొద్దు ప్లీజ్!
సియోల్ : ఇవాళ దక్షిణ కొరియాలో ‘డాగ్ మీట్ డే’. ఇందులో ఏముంది అనుకుంటున్నారా? చనిపోయిన చిన్న కుక్కపిల్లను పట్టుకొని దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని పార్లమెంటు ముందర ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని వెనక నిలబడి కొందరు గట్టిగా నినాదాలు చేస్తున్నారు. పార్లమెంటుకు సమీపంలోనే మరి కొంతమంది వీరికి వ్యతిరేకంగా ఇంకా గట్టిగా నినాదాలు చేస్తున్నారు. ఇలా నినాదాలు, ప్రతి నినాదాలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తింది. దీనికి కారణం ‘డాగ్ మీట్ డే’. కుక్క మాంసాన్ని వండుకుని తినే సంప్రదాయ దినోత్సవం ‘బొక్నాల్’ను డాగ్ మీట్ డే గా జరుపుకుంటారు కొరియన్లు. అందుకే ఒకపక్క కుక్కల మాంసం నిషేధించాలని జంతుప్రేమికులు పోరాడుతుంటే.. ఏంటి? మమ్మల్నే తినొద్దంటారా? కుక్క మాంసం తినడం మా సంస్కృతిలో భాగం, మీరెవరు తినొద్దని చెప్పడానికి అంటూ స్థానిక కొరియన్లు వీరిని కసురుకుంటున్నారు. అయితే ఈ నిరసనలో జంతుప్రేమికురాలు, అమెరికన్ నటి కిమ్ బాసింగర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లాస్ట్ చాన్స్ ఫర్ యానిమల్స్ గ్రూపు సభ్యులతో కలసి కుక్కల మాంస పరిశ్రమను కొరియాలో నిషేధించాలని గట్టిగా కోరారు. జంతు హింసకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్న కిమ్ బాసింగర్ కొరియాకు రావడం మాత్రం ఇదే తొలిసారి. ‘ఏదైనా మార్పు ఒక్కసారిగా సంభవించదని, కొరియన్లు మార్పును అంగీకరిస్తారని’ ఆమె ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. కుక్కలు తినొద్దు ప్లీజ్ అంటూ కొరియన్లను అభ్యర్థించారు. అయితే కొరియన్లు మాత్రం కుక్క మాంసం తినే దినోత్సవం ‘బొక్నాల్’ రోజునే ఈ నిరసనలు జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, చర్మం స్మూత్‌గా తయారవుతుందని, వయసు కనిపించదని, చాలా రకాల వ్యాధులు దరిచేరవని వీరి విశ్వాసం. గత సంవత్సరం కూడా అతిపెద్ద కుక్క మాంసం ప్రదర్శనను నిలిపివేయడంలో జంతుప్రేమికులు విజయం సాధించారు. కరెంటు షాక్ ఇచ్చి మరీ పెద్ద ఎత్తున కుక్కలను చంపుతున్నారంటూ ఆరోపించడంతో ప్రభుత్వం ఈ ప్రదర్శనను రద్దుచేసింది. అప్పుడే ఆగ్రహంగా ఉన్న వీరు తాజాగా సంప్రదాయ ‘డాగ్ మీట్ డే’ న కూడా అడ్డుతగులడంతో రోడ్డుపైనే మాంసాన్ని తింటూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇది మా సంప్రదాయం. కొరియాలో చాలా మంది పేదవారు ఉన్నారు. వారికి తక్కువ ఖర్చులో ప్రొటీన్స్ దొరకడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో 44 శాతం మంది కుక్కలను చంపడాన్ని వ్యతిరేకించగా, 43 శాతం మంది మాకు కుక్క మాంసం కావాలని కోరారు. 2017లో మాత్రం కుక్కమాంసం కావాలని కోరిన వారే ఎక్కువ. ఇప్పుడు వీరి శాతం తగ్గడంతో ఏదో ఒక రోజు కొరియాలో కుక్కలు వీధుల్లో ప్రశాంతగా తిరిగే రోజు చూస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జంతుప్రేమికులు. ఇప్పటికే కుక్కలను చంపడాన్ని నేరంగా ప్రకటించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందడానికి పార్లమెంటులో సరైన మద్దతు లభించట్లేదు. విచిత్రం ఏమంటే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ జంతుప్రేమికుడు. దీనిపై స్పందించిన ఆయన కుక్క మాంసం తినడం అనేది వ్యక్తిగతమని పేర్కొన్నారు. అయితే పార్లమెంటులో ఈ బిల్లుపై మాట్లాడకుండా సభ్యులపై కుక్క మాంస వ్యాపారస్తులు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట. -
కుటుంబాల కలయికకు ‘కొరియాలు’ ఓకే
సియోల్: కొరియా యుద్ధం వల్ల దూరమైన కుటుంబాలు తిరిగి కలుసుకోడానికి ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘ఇరువైపులా 100 మందిని ఎంపిక చేసి ఆగస్టు 20–26 మధ్య కలుసుకోడానికి అనుమతిస్తాం’ అని అందులో పేర్కొన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన భేటీలోనే ఉత్తర, దక్షిణ కొరియాల అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్, మూన్ జయే ఇన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంపికైనవారు తమ బంధువులతో గడిపేందుకు 3 రోజులు సమయమివ్వనున్నారు. విడిపోయిన తమ బంధువులను కలుసుకోడానికి దక్షిణ కొరియాలో 57 వేల మంది రెడ్ క్రాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. 1950–53 మధ్య జరిగిన యుద్ధం వల్ల కొరియా విభజన జరిగి లక్షల్లో ప్రజలు వేరయ్యారు. -
ఆత్మీయ ఆలింగనం
దక్షిణకొరియా సరిహద్దులో ఉన్న ఉత్తరకొరియా గ్రామం పాన్‌మున్‌జోన్‌లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను ఆలింగనం చేసుకున్న ద.కొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ సమావేశమవడం ఇది రెండోసారి. -
అణ్వాయుధాలను నిర్మూలిద్దాం
గొయాంగ్ (దక్షిణ కొరియా): ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. గత 70 ఏళ్లుగా వైరంతో రగిలిపోయిన ఆ రెండు దాయాది దేశాలు శుక్రవారం శాశ్వత శాంతి దిశగా ముందడుగు వేశాయి. ఆ మేరకు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఇన్ల మధ్య అంగీకారం కుదిరింది. శుక్రవారం రెండు దేశాలను వేరు చేసే సైనిక విభజన రేఖ వద్ద ఇరువురు దేశాధి నేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగు పెట్టారు.ముందుగా కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్ ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లారు. తర్వాత కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. అనంతరం కిమ్, మూన్‌ల మధ్య చరిత్రాత్మక సమావేశం జరిగింది. ఇరువురు ఒప్పందం చేసుకుని, సంతకాలు చేశారు. ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పాన్మున్జోమ్లోని మూడంతస్తుల భవనం ‘పీస్ హౌస్’లో వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా కిమ్ సుమారు గంటా 40 నిమిషాలు దక్షిణ కొరియాలో గడిపారు. కాగా కొరియా యుద్ధం అనంతరం 65 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఇది చారిత్రక సమావేశమని ఐరాస ప్రధాన కార్యదర్శి కొనియాడారు. కీలక ఒప్పందాలు కుదిరేందుకు ఇరువురు నేతలు చూపిన ధైర్యానికి, నాయకత్వ పటిమకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన చెప్పారు. ఒప్పందంలో అంశాలివీ.. ఇరు దేశాల ఒప్పందంలో దశల వారీగా ఆయుధాల తగ్గింపు, ప్రతీకార చర్యలను నిలిపివేయడం, సరిహద్దులో ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి శాంతియుత వాతావరణం నెలకొల్పడం, అమెరికా తదితర దేశాలతో చర్చలు వంటి అంశాలు ఉన్నాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలపై చర్చ సమావేశం ప్రారంభానికి ముందు కిమ్ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్తో అన్నారు. కొత్త చరిత్ర ప్రారంభానికి ముందు సానుకూల సంకేతాలు ఇవ్వడానికి.. నిజాయితీతో, స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉత్తర కొరియాలో పెద్ద మొత్తంలో ఉన్న అణ్వాయుధ సంపత్తి గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా సదస్సుకు హాజరయ్యారు. మూన్తో పాటు ఆయన నిఘా విభాగం చీఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ హాజరయ్యారు. పాన్‌మున్‌జోమ్‌లో కలయికకు గుర్తుగా ఇరువురు దేశాధ్యక్షులు విభజన రేఖ వద్ద మొక్కలను నాటారు. అనంతరం వారిరువురు భార్యలతో కలసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూన్ మాట్లాడుతూ తాము భవిష్యత్తులోనూ సరిహద్దుకు ఇరువైపులా సమావేశాలు పెట్టుకుని కలసి చర్చిస్తామన్నారు. కాగా వచ్చే నెలలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. ఉభయ కొరియాల మధ్య మూడోసారి చర్చలు యుద్ధం తర్వాత ఉభయ కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. గతంలో 2000లో ఒకసారి, 2007లో మరోసారి ఇరు దేశాల మధ్య ప్యాంగ్యాంగ్లో ఇదే తరహాలో సమావేశాలు జరిగాయి. అయితే ఆ ఒప్పందాలేవీ ఆచరణకు నోచుకోలేదు. కాగా మే లేదా జూన్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. 70 ఏళ్ల వైరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ ఒకే దేశంగా కొనసాగిన కొరియా ద్వీపకల్పం అమెరికా, రష్యాల ప్రయోజనాల నేపథ్యంలో 1945లో రెండుగా చీలిపోయింది. అప్పటి నుంచి గతేడాది వరకూ ఇరు కొరియాల మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరు దేశాల మధ్య దశాబ్దాల వైరాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 1945: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో ఆ దేశ దురాక్రమణ నుంచి కొరియాకు విముక్తి. కొరియా ద్వీపకల్పాన్ని పంచుకున్న రష్యా, అమెరికా. కొద్దికాలం ఉత్తర కొరి యా రష్యా పర్యవేక్షణలో, దక్షిణ కొరియాలో అమెరికా పర్యవేక్షణలో పరిపాలన కొనసాగింది. 1948: డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఉత్తర కొరియా), సదరన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(దక్షిణ కొరియా)ల్లో ఎన్నికలు 1950: దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దురాక్రమణ.. ద.కొరియాకు మద్దతుగా అమెరికా, ఉ.కొరియాకు మద్దతుగా చైనా రంగ ప్రవేశం.. దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిన కొరియా యుద్ధం.. 1953: ముగిసిన కొరియా యుద్ధం. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం. 1961: చైనా, రష్యాలతో పెద్ద ఎత్తున రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న ఉత్తర కొరియా. 1998: ఉత్తర కొరియాతో సంబంధాల పునరుద్ధరణకు ద.కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ ప్రయత్నాలు. 2000: 1948 అనంతరం ఇరు దేశాల మధ్య తొలిసారిగా ద్వైపాక్షిక సదస్సు 2006: మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా 2010: దక్షిణ కొరియా నౌకను టార్పెడోతో కూల్చిన ఉ.కొరియా.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పూర్తిగా తెగదెంపులు చేసుకున్న ద.కొరియా 2018: ఇరుదేశాధినేతల శిఖరాగ్ర సదస్సు. పజులో ‘ఒక్కటే కొరియా’ జెండాలతో స్థానికులు -
కొరియాల యుగళ గీతం!
ఊహకందని ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగు తాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, దక్షిణా కొరియా అధినేత మూన్ జే–ఇన్ మధ్య శిఖరాగ్ర చర్చలకు అంగీకారం కుదిరిందని గత నెల 6న తొలిసారి ప్రకటన వెలువడినప్పుడు అందరూ అలాంటి సంభ్రమాశ్చర్యాలకే లోనయ్యారు. ఇది కలా నిజమా అనుకున్నారు. అసంభవం అనుకున్నది శుక్రవారం సాకార మైంది. ఇద్దరు అధినేతలూ శిఖరాగ్ర చర్చల్లో పాల్గొని రెండు కొరియాల మధ్యా యుద్ధం ఉండబోదని ప్రకటించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి సుస్థిరతలు, సమైక్యత వర్ధిల్లేందుకు సమష్టిగా కృషి చేస్తామని ప్రతినబూనారు. 2016 జనవరితో మొదలుపెట్టి గత ఏడాది డిసెంబర్ వరకూ అడపా దడపా జరిపే అణ్వాయుధ పరీ క్షలతో, క్షిపణి పరీక్షలతో పొరుగునున్న దక్షిణ కొరియా, జపాన్లకూ... అగ్రరాజ్య మైన అమెరికాకు నిద్ర లేకుండా చేసిన కిమ్ ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికొస్తా రని, ఇంతటి సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తారని ఎవరూ అనుకోలేదు. నిరు డంతా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కూ, కిమ్కూ మధ్య తీవ్ర స్థాయి వాగ్యుద్ధం కొనసాగింది. దాంతోపాటు ఉత్తర కొరియాపై ఆంక్షల తీవ్రత పెరిగింది. తమ దేశానికి ముప్పు కలిగించాలని చూస్తే కనీ వినీ ఎరుగని విధ్వంసం చవి చూడా ల్సివస్తుందని ట్రంప్ హెచ్చరిస్తే... మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి హ్వాసంగ్–12ను ప్రయోగించడం ద్వారా ఉత్తరకొరియా దానికి బదులిచ్చింది. 2,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆ క్షిపణి తమ గగనతలం మీదుగా వెళ్లిందని నిర్ధారించు కున్న జపాన్ ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికాను సైతం ధ్వంసం చేయగల సత్తా తమకున్నదని కిమ్ హెచ్చరించారు. ట్రంప్ చేసే దూషణలకు ఎప్పటికప్పుడు అదే పరిభాషలో బదులిస్తూ బెదిరింపులకు తాను లొంగనుగాక లొంగనని ఆయన తేటతెల్లం చేశారు. తమది చిన్న దేశమైనా, అమెరికాతో పోలిస్తే సిరిసంపదలు అంతంతమాత్రమే అయినా ఆత్మగౌరవం పుష్కలంగా ఉన్నదని, దాన్ని కాపాడు కునేందుకు అవసరమైనన్ని అణు బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయని కిమ్ గత రెండేళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా తెలియజెబుతూనే వచ్చారు. పర్యవసానంగా బెదిరింపుల పరిభాష మారింది. ఉత్తర కొరియా సంపూర్ణంగా అణ్వాయుధ రహితం కావడం మినహా మరేదీ తమకు సమ్మతం కాదని, అందుకు సిద్ధపడే వరకూ ఆ దేశంతో ఎలాంటి చర్చలూ ఉండబోవని ప్రకటిస్తూ వచ్చిన అమెరికా వెనక్కి తగ్గింది. శాంతి చర్చలకు మార్గం సుగమమైంది. రాజకీయ సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చునని ఉభయ కొరియాల మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు రుజువు చేశాయి. ఈ పరిణామం పర్యవసానంగా ఇక శాంతి ఏర్పడటం ఖాయమేనని చెప్పలేం. ఎందుకంటే కొరియాల మధ్య ఉన్న శత్రుత్వం సాధారణమైంది కాదు. గత 68 ఏళ్లుగా ఆ రెండూ సాంకేతికంగా చూస్తే యుద్ధంలోనే ఉన్నాయి. 1950లో మొదలైన యుద్ధం మూడేళ్లు కొనసాగి ఇరు వైపులా దాదాపు 12 లక్షలమంది మరణించాక 1953లో యుద్ధ విరమణ సంధి కుదిరినా దాన్ని దక్షిణ కొరియా గుర్తించలేదు. నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ చొరవతో కుదిరిన ఈ సంధిపై అమెరికా, ఉత్తర కొరియా, చైనాలు మాత్రమే సంతకాలు చేశాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే అమెరికా దాన్ని ఉల్లం ఘించింది. ద్వీపకల్పంలోకి విధ్వంసకర ఆయుధాలను తరలించరాదన్న నిబం ధనను ఉల్లంఘించి దక్షిణ కొరియాలో అణ్వాయుధాలను మోహరించింది. ఒక పక్క అలా చేస్తూనే ఉత్తర కొరియా నిరాయుధంగా ఉండాలని ఆశించింది. ఆ దేశం ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నదన్న సమాచారం అందాక 1994లో నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ దాన్ని ఆపేందుకు చర్చలు జరిపారు. ఆ ప్లుటోనియంను అణు విద్యుత్ కోసం వినియోగించేందుకు అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఒప్పందం కుదిరింది. దీర్ఘశ్రేణి క్షిపణుల ఉత్పత్తిని కూడా నిలిపేసేందుకు అంగీకారం కుదరబోతుండగా అమెరికాలో 2000 సంవత్సరంలో జార్జి బుష్ హయాం ప్రారంభమైంది. ఆయన బెదిరింపుల పర్వానికి తెరతీశారు. 1994నాటి ఒప్పందాన్ని అటకెక్కించారు. ఉత్తరకొరియా దొంగచాటుగా యురే నియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపిస్తూ ఆ దేశంపై ఆంక్షలను తీవ్రంచేశారు. ఇరాక్ దురాక్రమణలో అది నిండా మునిగి ఉండగా ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణ్వాయుధ దేశంగా రూపుదిద్దుకుంది. ఇన్నేళ్లుగా దక్షిణ కొరియా అమెరికా, జపాన్‌లతో కలిసి పలుమార్లు సైనిక, నావికా దళ విన్యాసాలు నిర్వ హించింది. పలుమార్లు యుద్ధ సన్నాహాలు చేసింది. ఈ కాలమంతా చైనా ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. అందువల్లనే చైనా ప్రమేయంలేని ఎలాంటి శాంతి ఒప్పందమైనా ఫలి తాన్నివ్వదు. ఈ శిఖరాగ్ర చర్చలను చైనా సహజంగానే స్వాగతించింది. దీనికి కొనసాగింపుగా జరిగే చర్చల్లో తన పాత్రేమిటో తేల్చి చెప్పాలని అది ఎదురుచూస్తోంది. గత నెలలో కిమ్‌ను తమ దేశానికి ఆహ్వానించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇప్పటికే ఆ సంగతిని తేటతెల్లం చేశారు. 1953నాటి యుద్ధ విరమణ సంధిలో చైనా భాగస్వామి. దక్షిణ కొరియానుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అక్కడ అణ్వాయుధాలను తొలగించేవరకూ ద్వీపకల్పంలో శాంతి సాధ్యం కాదని చైనా వాదిస్తోంది. ఉభయ కొరియాల విలీనానికైనా, వాటి మధ్య కుదిరే శాంతి ఒప్పందానికైనా ఇదే షరతు కావాలని చెబుతోంది. లేకుంటే అది అంతిమంగా తన భద్రతకు ముప్పు కలిగిస్తుందని దానికి తెలుసు. వచ్చే జూన్‌లో ట్రంప్, కిమ్‌లు కూడా సమావేశం కాబోతున్నారు. కాలం చెల్లిన ఎత్తుగడలకు అమెరికా ఇకపై స్వస్తి చెప్పి కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే, ఈ ప్రాంతం నుంచి అణ్వాయుధాల తొల గింపునకూ, తన దళాల ఉపసంహరణకూ అంగీకరిస్తే ఒక సంక్లిష్ట సమస్య పరి ష్కారమవుతుంది. 65 ఏళ్లనాటి తన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి అమెరికాకు ఇదొక మంచి అవకాశం. -
ఏప్రిల్‌లో ‘కొరియా’ శిఖరాగ్ర భేటీ
సియోల్: దేశ రక్షణకు పూచీ ఇస్తే అణ్వాయుధాలను త్యజించేందుకు ఉత్తరకొరియా ముందుకువచ్చింది. దీంతోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు కూడా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సంసిద్ధత తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ జాతీయ భద్రతా సలహాదారు చుంగ్–ఇయు–యాంగ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల ఉ.కొరియా వెళ్లింది. రాజధాని ప్యాంగ్యాంగ్లో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ బృందం సమావేశమైంది. మంగళవారం తిరిగి స్వదేశానికి చేరుకున్న ఈ బృందం చర్చల ఫలితాలను వెల్లడించింది. ఉ.కొరియాతో చర్చల్లో గణనీయ పురోగతి కనిపించిందని పేర్కొంది. సరిహద్దు గ్రామం పన్‌మున్‌జోంలో ఏప్రిల్‌లో రెండు దేశాల అధ్యక్షుల సమావేశానికి అంగీకారం కుదిరిందని తెలిపింది. తమపై సైనిక పరమైన ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసి, ప్రభుత్వ మనుగడకు గ్యారెంటీ ఇచ్చిన పక్షంలో అణ్వాయుధాలను, క్షిపణులను కలిగి ఉండటంలో అర్థం లేదని, వాటిని త్యజిస్తామని ఉత్తరకొరియా పాలకుడు చెప్పినట్లు యాంగ్ వెల్లడించారు. తాము ఎలాంటి అణు, మిస్సైల్ పరీక్షలు జరుపబోమని ఉత్తరకొరియా హామీ ఇచ్చిందన్నారు. -
కిమ్‌తో దక్షిణ కొరియా అధికారుల భేటీ
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన అత్యంత సీనియర్ అధికారుల బృందం ఉత్తర కొరియాకు వెళ్లి ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను సోమవారం కలిసింది. గత దశాబ్ద కాలంలో దక్షిణ కొరియా అధికారులు ఉత్తర కొరియాకు రావడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తరఫున ప్రతినిధులుగా వచ్చిన ఈ బృంద సభ్యులు, అమెరికాతో చర్చలకు కిమ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఉభయ కొరియాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి ఇటీవలే దక్షిణ కొరియాలో జరిగిన శీతాకాల ఒలింపిక్స్‌కు కిమ్ సోదరి హాజరవడం తెలిసిందే. ఉత్తర కొరియాలో పర్యటించాల్సిందిగా మూన్‌ను ఆమె కిమ్ తరఫున అప్పట్లో ఆహ్వానించారు. -
చారిత్రక కరచాలనం
ప్యాంగ్‌చాంగ్: బద్ధ శత్రువులైన ఉభయ కొరియా దేశాల మధ్య సామరస్యం, సౌభ్రాభృత్వం వెల్లివిరిశాయి. దక్షిణ కొరియాలోని ప్యాంగ్చాంగ్లో శుక్రవారం వింటర్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకల కార్యక్రమం ఇందుకు వేదికైంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా క్రీడాకారుల బృందాలు కలసి ఒకే జెండా కింద పరేడ్‌లో పాల్గొన్నాయి. అథ్లెట్ల పరేడ్ జరుగుతున్నప్పుడు, వీఐపీ గ్యాలరీలోకి అడుగుపెడుతున్నప్పుడు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–ఇన్ .. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చెల్లి కిమ్ యో జోంగ్‌తో రెండుసార్లు కరచాలనం చేశారు. ఎన్ని విభేదాలున్నా శాంతి, సామరస్యంతో కలసిమెలసి జీవించేలా ఉభయ కొరియాలు స్ఫూర్తినిస్తున్నాయని ఒలంపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. -
ఉత్తర కొరియాలో పర్యటిస్తా: మూన్
సియోల్: దక్షిణ కొరియా 19వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియాకు చెందిన మూన్ జే ఇన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతీయ అసెంబ్లీ భవనంలో ప్రసంగించిన మూన్.. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశం ఉత్తర కొరియాలోనూ పర్యటిస్తానని అన్నారు. శాంతి కోసం అమెరికా, చైనాలతోనూ చర్చలు జరుపుతానని చెప్పారు. అనంతరం అధ్యక్ష భవనం ‘బ్లూ హౌస్’లో తన తొలి విలేకరుల సమావేశంలో మూన్ పాల్గొన్నారు . మోదీ శుభాకాంక్షలు: దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జే ఇన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లిష్‌తోపాటు, కొరియా భాషలో మోదీ ట్వీట్ చేశారు. మూన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్లూ శుభాకాంక్షలు తెలిపారు.