ఉత్తర కొరియాలో పర్యటిస్తా: మూన్
సియోల్: దక్షిణ కొరియా 19వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియాకు చెందిన మూన్ జే ఇన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతీయ అసెంబ్లీ భవనంలో ప్రసంగించిన మూన్.. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశం ఉత్తర కొరియాలోనూ పర్యటిస్తానని అన్నారు. శాంతి కోసం అమెరికా, చైనాలతోనూ చర్చలు జరుపుతానని చెప్పారు. అనంతరం అధ్యక్ష భవనం ‘బ్లూ హౌస్’లో తన తొలి విలేకరుల సమావేశంలో మూన్ పాల్గొన్నారు .
మోదీ శుభాకాంక్షలు: దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జే ఇన్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లిష్‌తోపాటు, కొరియా భాషలో మోదీ ట్వీట్ చేశారు. మూన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌లూ శుభాకాంక్షలు తెలిపారు.