సరిహద్దు గ్రామంలోని ‘పీస్ హౌస్’ భవంతిలో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ల కరచాలనం
గొయాంగ్ (దక్షిణ కొరియా): ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. గత 70 ఏళ్లుగా వైరంతో రగిలిపోయిన ఆ రెండు దాయాది దేశాలు శుక్రవారం శాశ్వత శాంతి దిశగా ముందడుగు వేశాయి. ఆ మేరకు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ ఇన్‌ల మధ్య అంగీకారం కుదిరింది.
శుక్రవారం రెండు దేశాలను వేరు చేసే సైనిక విభజన రేఖ వద్ద ఇరువురు దేశాధి నేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగు పెట్టారు.ముందుగా కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడిని తమ దేశంలోకి ఆహ్వానించడంతో మొదట మూన్ ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లారు. తర్వాత కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడిచారు. అనంతరం కిమ్, మూన్‌ల మధ్య చరిత్రాత్మక సమావేశం జరిగింది. ఇరువురు ఒప్పందం చేసుకుని, సంతకాలు చేశారు.
ఉభయ కొరియాల సరిహద్దులోని శాంతి గ్రామం పాన్‌మున్‌జోమ్‌లోని మూడంతస్తుల భవనం ‘పీస్ హౌస్’లో వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా కిమ్ సుమారు గంటా 40 నిమిషాలు దక్షిణ కొరియాలో గడిపారు. కాగా కొరియా యుద్ధం అనంతరం 65 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే ప్రథమం. ఇది చారిత్రక సమావేశమని ఐరాస ప్రధాన కార్యదర్శి కొనియాడారు. కీలక ఒప్పందాలు కుదిరేందుకు ఇరువురు నేతలు చూపిన ధైర్యానికి, నాయకత్వ పటిమకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన చెప్పారు.
ఒప్పందంలో అంశాలివీ.. ఇరు దేశాల ఒప్పందంలో దశల వారీగా ఆయుధాల తగ్గింపు, ప్రతీకార చర్యలను నిలిపివేయడం, సరిహద్దులో ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి శాంతియుత వాతావరణం నెలకొల్పడం, అమెరికా తదితర దేశాలతో చర్చలు వంటి అంశాలు ఉన్నాయి.
ఉత్తర కొరియా అణ్వాయుధాలపై చర్చ
సమావేశం ప్రారంభానికి ముందు కిమ్ తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నానని మూన్‌తో అన్నారు. కొత్త చరిత్ర ప్రారంభానికి ముందు సానుకూల సంకేతాలు ఇవ్వడానికి.. నిజాయితీతో, స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉత్తర కొరియాలో పెద్ద మొత్తంలో ఉన్న అణ్వాయుధ సంపత్తి గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కూడా సదస్సుకు హాజరయ్యారు.
మూన్‌తో పాటు ఆయన నిఘా విభాగం చీఫ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ హాజరయ్యారు. పాన్‌మున్‌జోమ్‌లో కలయికకు గుర్తుగా ఇరువురు దేశాధ్యక్షులు విభజన రేఖ వద్ద మొక్కలను నాటారు. అనంతరం వారిరువురు భార్యలతో కలసి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూన్ మాట్లాడుతూ తాము భవిష్యత్తులోనూ సరిహద్దుకు ఇరువైపులా సమావేశాలు పెట్టుకుని కలసి చర్చిస్తామన్నారు. కాగా వచ్చే నెలలో ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి.
ఉభయ కొరియాల మధ్య మూడోసారి చర్చలు
యుద్ధం తర్వాత ఉభయ కొరియా దేశాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. గతంలో 2000లో ఒకసారి, 2007లో మరోసారి ఇరు దేశాల మధ్య ప్యాంగ్యాంగ్‌లో ఇదే తరహాలో సమావేశాలు జరిగాయి. అయితే ఆ ఒప్పందాలేవీ ఆచరణకు నోచుకోలేదు. కాగా మే లేదా జూన్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది.
70 ఏళ్ల వైరం
రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ ఒకే దేశంగా కొనసాగిన కొరియా ద్వీపకల్పం అమెరికా, రష్యాల ప్రయోజనాల నేపథ్యంలో 1945లో రెండుగా చీలిపోయింది. అప్పటి నుంచి గతేడాది వరకూ ఇరు కొరియాల మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కొనసాగాయి. ఇరు దేశాల మధ్య దశాబ్దాల వైరాన్ని ఒకసారి పరిశీలిస్తే..
1945: రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమితో ఆ దేశ దురాక్రమణ నుంచి కొరియాకు విముక్తి. కొరియా ద్వీపకల్పాన్ని పంచుకున్న రష్యా, అమెరికా. కొద్దికాలం ఉత్తర కొరి యా రష్యా పర్యవేక్షణలో, దక్షిణ కొరియాలో అమెరికా పర్యవేక్షణలో పరిపాలన కొనసాగింది.
1948: డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(ఉత్తర కొరియా), సదరన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా(దక్షిణ కొరియా)ల్లో ఎన్నికలు
1950: దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దురాక్రమణ.. ద.కొరియాకు మద్దతుగా అమెరికా, ఉ.కొరియాకు మద్దతుగా చైనా రంగ ప్రవేశం.. దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిన కొరియా యుద్ధం..
1953: ముగిసిన కొరియా యుద్ధం. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం.
1961: చైనా, రష్యాలతో పెద్ద ఎత్తున రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న ఉత్తర కొరియా.
1998: ఉత్తర కొరియాతో సంబంధాల పునరుద్ధరణకు ద.కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ ప్రయత్నాలు.
2000: 1948 అనంతరం ఇరు దేశాల మధ్య తొలిసారిగా ద్వైపాక్షిక సదస్సు
2006: మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా
2010: దక్షిణ కొరియా నౌకను టార్పెడోతో కూల్చిన ఉ.కొరియా.. ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పూర్తిగా తెగదెంపులు చేసుకున్న ద.కొరియా
2018: ఇరుదేశాధినేతల శిఖరాగ్ర సదస్సు.
పజులో ‘ఒక్కటే కొరియా’ జెండాలతో స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment