'అవినీతి బొమ్మ వేస్తే ఆయనలా ఉంటుంది'
లండన్: అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్‌పై నేరుగా విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరు పుతిన్ అని, అవినీతి బొమ్మకుకు ఆయన ప్రతిరూపమని ఆరోపించారు. ఉక్రెయిన్‌లోని క్రెమియాను తమ దేశంలో కలుపుకోవడంతో రష్యాపై అమెరికా 2014లో ఆంక్షలు విధించింది. అయినప్పటికీ అప్పట్లో పుతిన్‌పై అమెరికా ఆరోపణలు చేయలేదు. అయితే పుతిన్ రహస్య సంపదలపై జరిపిన స్థూల దర్యాప్తులో ఆయన అవినీతి బొమ్మకు ప్రతిరూపంగా నిలిచారని ఆడం జుబిన్ అన్నారు. అమెరికా ట్రెజరీలో ఉగ్రవాదం, ఆర్థిక నిఘాకు తాత్కాలిక అండర్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న జుబిన్ బీబీసీలో సోమవారం ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఈ విషయాలు తెలిపారు.
'ప్రభుత్వ సంపదలను ఉపయోగించుకొని ఆయన తన సన్నిహితులు, స్నేహితులను సంపన్నులుగా మార్చివేశారు. అదేసమయంలో తనుకు స్నేహితులు కాదనుకున్న వారిని తొక్కిపారేశారు. ఇంధన సంపదలైనా, ప్రభుత్వ కాంట్రాక్టులైనా తనకు సేవలు చేస్తారనుకున్న వారికే పుతిన్ కట్టబెట్టేవారు. తనకు సేవ చేయని వారిని దూరం పెట్టేవారు' అని ఆయన పేర్కొన్నారు.