ట్రంప్‌కు అమెరికా విరోధి మద్దతు?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు దాని బద్ధవిరోధి రష్యా ప్రయత్నిస్తున్నదా? అమెరికా అధ్యక్షుడిగా తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నిస్తున్నారా? అంటే తాజా వార్తలు అవుననే అంటున్నాయి. తాజాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘ఏదైనా సాధ్యమే’ అని ఒబామా బదులిచ్చారు.
గతవారం డెమొక్రటిక్ నేషనల్ కమిటీ డాటాను దొగలించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారు. రష్యా నిఘా వర్గాల తరఫున హ్యాకర్లు ఈ పనికి ఒడిగట్టినట్టు గట్టి ఆధారాలు లభించాయని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్‌ను గెలిపించుకునేందుకు పుతిన్ ఈ కుయుక్తులకు పాల్పడుతున్నారని డెమొక్రటిక్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైట్‌హౌస్‌లో తన మిత్రుడు ట్రంప్‌ను ప్రతిష్టించుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. మరోవైపు అమెరికా అధికారుల వాదనకు వీకీలీక్స్ వెల్లడించిన మెయిల్స్ కూడా మద్దతు పలుకుతున్నాయి.