మిన్నెసోటా : అమెరికన్లు మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగినచారిత్రక భేటీపైనే కాకుండా ఓ రకూన్(పిల్లిని పోలిన జీవి) గురించి కూడా విపరీతంగా చర్చించారు. ఎందుకంటే అది చేసిన విన్యాసం అటువంటింది. ఆ రకూన్ సెయింట్ పాల్ మిన్నెసోటాలోని యూబీఎస్ భవనాన్ని స్పైడర్ మ్యాన్‌లా ఎక్కడానికి ప్రయత్నించింది. మధ్యాహ్నం గోడపై పాకుంటూ దాదాపు 12 ఫోర్లు ఎక్కాక అది గమనించిన.. మిన్నెసోటా పబ్లిక్ రెడియో రిపోర్టర్ టిమ్ నెల్సన్ ఈ విషయాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఈ వార్త వైరల్‌గా మారింది. సాధారణంగా ఇండ్లలో పెంచుకునే రకూన్‌లు చాలా కూల్‌గా ఉంటాయి. కానీ ఈ రకూన్ ఇలా చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ బిల్డింగ్‌లో ఉన్నవారు కూడా దానిని లోపలి నుంచి ఫొటోలు తీయడం ప్రారంభించారు. స్థానిక టీవీ చానెళ్లు దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టాయి. మెల్లిమెల్లిగా 22వ ఫ్లోర్‌కు చేరుకున్న రకూన్ అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంది. #MPRraccoon ట్యాగ్‌తో ట్విటర్‌లో విపరీతమైన చర్చ జరిగింది. దానిని ఎలాగైనా కిందికి తీసుకురావాలంటూ నెటిజన్లు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఆ బిల్డింగ్ అద్దాలు తెరుచుకునేవి కాకపోవడం, అది అంత ఎత్తులో ఉండటంతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అది ఆ తర్వాత కిందికి దిగడం ప్రారంభించింది. నిల్సన్‌తో పాటు స్థానిక మీడియా కూడా దీనిపై తాజా సమాచారాన్ని అందిస్తున్నాయి. మంగళవారం రాత్రి కూడా రకూన్ కదలికలను గమనిస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం అది 17వ ఫ్లోర్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment