రాకెట్‌లాంటి బుల్లెట్!
- లక్ష్యాన్ని బట్టి ప్రయాణం మధ్యలో దిశ మార్చుకునే పరిజ్ఞానం
- ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న అమెరికా పరిశోధన సంస్థ డార్పా
వాషింగ్టన్: ఓ హాలీవుడ్ సినిమాలో చూపినట్లు లక్ష్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు ప్రయాణ మార్గాన్ని మార్చుకునే బుల్లెట్లు కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. అమెరికా రక్షణ శాఖకు చెందిన పరిశోధన సంస్థ ఇప్పటికే ఇలాంటి బుల్లెట్లను రూపొందించి ప్రయోగాత్మకంగా పరీక్షించింది. గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరేందుకు సైనికుల కోసం ప్రత్యేకంగా గెడైడ్ బుల్లెట్లను డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డార్పా) రూపొందించింది.
ఇది అభివృద్ధి పరిచిన 0.50 క్యాలిబర్ బుల్లెట్లు ఆప్టికల్ సైటింగ్ టెక్నాలజీ ఆధారంగా పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తాయి. వాస్తవిక నిర్దేశిత వ్యవస్థ ఆధారంగా బుల్లెట్‌ను పేల్చిన తర్వాత అవసరమైతే ప్రయాణం మధ్యలోనే దాని దిశను మార్చే అవకాశం ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ ఆక్యురసీ ఆస్కుడ్ ఆర్డినెన్స్(ఎక్సాక్టో) ప్రోగ్రామ్ పేరుతో మిలటరీ అవసరాల కోసమే ఇలాంటి బుల్లెట్లను డార్పా తయారు చేసింది.
లక్ష్యం కంటి ముందు లేనప్పటికీ, ప్రతికూల వాతావరణంలో కదులుతున్నప్పటికీ ఈ రకం బుల్లెట్లను విజయవంతంగా ప్రయోగించవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల సైనికులకు పోరాడే సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయపడింది. గెడైడ్ బుల్లెట్ల వినియోగం వల్ల రక్షణ దళాలకు భద్రత కూడా పెరుగుతుందని, శత్రువులకు ఎదురుదాడి చేసే అవకాశమివ్వకుండా లక్ష్యాలను కచ్చితంగా ఛేదించవచ్చునని వివరించింది.