ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఎలా ఉందంటే.. | Ransomware attack: Who's been hit | Sakshi
Sakshi News home page

ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఎలా ఉందంటే..

Published Mon, May 15 2017 10:07 PM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఎలా ఉందంటే..

ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఎలా ఉందంటే..

ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా, ఆధునిక టెక్నాలజీ భద్రతకు సవాలు విసురుతూ ఉద్భవించిన వనాక్రై ర్యాన్సమ్ వేర్ బాధితుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఈ సైబర్ దాడి 150 దేశాల్లో బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

జపాన్‌
ప్రస్తుతం జపాన్ లోని అతిపెద్ద మోటార్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ కు చెందిన కొన్ని యూనిట్లను వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది. కానీ తమ బిజినెస్ లపై అంతపెద్ద ప్రభావమేమీ పడలేదని పేర్కొంది. హిటాచి అధికార ప్రతినిధి కూడా తమ ఫైల్స్ ఓపెన్ కావడం లేదని, ఈ-మెయిల్స్ వ్యవస్థ స్తంభించిందని, అసలు డెలివరీ కావడం లేదని పేర్కొన్నారు.

చైనా
చైనాలో ప్రభుత్వ ఏజెన్సీలతోసహా దాదాపు 30వేల సంస్థలపై ర్యాన్‌సమ్‌వేర్‌ ప్రభావం తీవ్రంగా పడినట్లు తెలిసింది. లక్షల సంఖ్యలో కంప్యూటర్లలో వనా క్రై చొచ్చుకుపోయిందని చైనా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు, పరిశోధన కేంద్రాలు, ఏటీఎంలు, ఆసుపత్రులకు సంబంధించిన కంప్యూటర్‌ వ్యవస్థలకు నష్టం జరిగిందని.. క్విహూ360 అనే చైనా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం ఈ సైబర్‌ దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలిపింది. చైనా సైబర్‌స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఈ వైరస్‌ విస్తరిస్తోంది. అయితే విస్తరణ వేగం తగ్గిందని ఆ సంస్థ వెల్లడించింది.

రష్యా
రైల్వే వ్యవస్థలోని ఐటీ కంప్యూటర్లు వైరస్‌ అటాక్‌ గురయ్యాయని స్థానికి మీడియా తెలిపింది. అయితే దీని ప్రభావం ఆపరేషన్స్‌పై పడలేదని వెల్లడించింది. దీంతోపాటూ ఇంటీరియర్‌ మినిస్ట్రీ, టెలీకమ్యూనికేషన్‌ సంస్థ మెగాఫోన్‌కు చెందిన సిస్టమ్స్‌ కూడా ఈ వైరస్‌ బారిన పడ్డాయని తెలిపింది. అయితే చాలా తక్కువ శాతం సిస్టమ్స్‌ ఈ వైరస్‌ బారిన పడ్డాయని పేర్కొంది. కాగా, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన వనా క్రై వైరస్‌ విషయంలో రష్యాకు సంబంధం లేని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలే దీన్ని సృష్టించి ఉంటాయని విమర్శించారు. అయితే వైరస్‌ ప్రభావం రష్యాపై పెద్దగా లేదని.. అయినా సైబర్‌ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్‌ తెలిపారు.

స్పెయిన్‌ : స్పెయిన్‌ టెలిఫోన్‌ దిగ్గజం టెలిఫోనికా(టీఈఎఫ్‌)ని వనాక్రై టార్గెట్ చేసిందని ఆ కంపెనీ ధృవీకరించింది.  

యూకే : నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌)కు చెందిన 6 ఆర్గనైజేషన్స్‌లు దాడికి గురైనట్టు సంస్థ తెలిపింది. పరిస్థితులను సమీక్షించడానికి యూకే ప్రభుత్వం క్రైసిస్‌ రెస్పాన్స్‌ కమిటీ(కోబ్రా)ను సమావేశపరిచింది.

జర్మనీ : రైల్వే వ్యవస్థ(డట్‌చ్‌ బాహ్న్)పై ర్యాన్‌సమ్‌వేర్‌ ప్రభావంతో ప్యాసింజర్‌ల వివరాలు మారినట్టు గుర్తించారు.

భారత్‌ : భారత్‌పై వనా క్రై ర్యాన్‌సమ్‌వేర్‌ పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. కేరళ, ఆంధ్రప్రదేశ్‌ మినహా పెద్ద నష్టమేమీ జరగలేదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నడిచే కంప్యూటర్లన్నీ వైరస్‌ ప్రభావం లేకుండా సాఫీగా పనిచేస్తున్నట్లు వివరించారు. విద్యుత్‌, జీఎస్టీఎన్‌ సహా పలు ప్రభుత్వ విభాగాలు కూడా తమ వ్యవస్థలు భద్రంగానే ఉన్నాయని స్పష్టం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement