కోటీశ్వరులైపోవాలనుకునే వారే లక్ష్యంగా... | Hackers New Axis Cryptojacking | Sakshi
Sakshi News home page

హ్యాకర్ల చేతికి కొత్త అస్త్రం, జరజాగ్రత్త!

Published Fri, Apr 6 2018 1:21 AM | Last Updated on Fri, Apr 6 2018 8:26 AM

Hackers New Axis Cryptojacking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సైబర్‌ నేరగాళ్ల చేతికి మరో అస్త్రం చిక్కిందా..? ర్యాన్‌సమ్‌వేర్‌ వంటి సైబర్‌ నేరాలతో కాసులు కురవడం కష్టమైపోవడం.. ఈ రంగంలో పోటీ ఎక్కువ కావడంతో హ్యాకర్లు కొత్త బాట పట్టారా..? దీనికి అవుననే సమాధానం చెపుతోంది ఇంటర్నెట్‌ సెక్యూరిటీ సంస్థ సైమాంటిక్‌. రాత్రికిరాత్రి కోటీశ్వరులైపోవాలనుకుని చట్టవ్యతిరేకమైన క్రిప్టో కరెన్సీ ఆర్జనలో మునిగితేలుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు క్రిప్టోజాకింగ్‌ చేస్తున్నారని వెల్లడించింది. గత ఏడాది కాలంలో ఇది చాలా ఎక్కువైందని, ఇది కాస్తా వ్యక్తులు, సంస్థల సమాచార భద్రతకు చేటు చేకూరుస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్‌ సెక్యూరిటీ థ్రెట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌టీఆర్‌) విడుదల సందర్భంగా భారత్‌లో నెట్‌ వినియోగదారులు ఎదుర్కొంటున్న భద్రతా పరమైన సమస్యలను ఏకరవు పెట్టింది సైమాంటిక్‌ సంస్థ. 

దీని ప్రకారం.. బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీ కోసం మైనింగ్‌ చేస్తున్న వారిని గుర్తించి వారి కంప్యూటర్లను తమ అధీనంలోకి తెచ్చుకోవడం గత ఏడాది కాలంలో దాదాపు 85 రెట్లు ఎక్కువైంది. క్రిప్టోకరెన్సీ విలువ ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వీటిపై చాలామందికి ఆసక్తి పెరిగిందని.. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని సైమాంటిక్‌ సంస్థ డైరెక్టర్‌ తరుణ కౌరా అంటున్నారు. సమాచారాన్ని సేకరించడంతోపాటు హ్యాకర్లు కొన్ని సందర్భాల్లో బాధితుల కంప్యూటర్‌ సామర్థ్యాన్నీ వాడేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. ఈ క్రిప్టోజాకింగ్‌ పెద్ద పెద్ద డేటా సెంటర్లు మొదలుకుని వ్యక్తిగత కంప్యూటర్ల స్థాయి వరకూ జరుగుతున్నట్లు తాము గుర్తించామన్నారు. సైమాంటిక్‌ గ్లోబల్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా తాము 157 దేశాల్లో జరిగే సైబర్‌ దాడులపై ఓ కన్నేసి ఉంచుతామని వివరించారు. 

ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని హైజాక్‌ చేసి..
క్రిప్టో కరెన్సీ విషయంలో భారత్‌ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో రెండో స్థానంలోనూ, ప్రపంచం మొత్తమ్మీద తొమ్మిదో స్థానంలో ఉన్న నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు ఈ డిజిటల్‌ సొమ్మును సేకరించే లక్ష్యంతో కంప్యూటర్లు, క్లౌడ్‌ సీపీయూల ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని హైజాక్‌ చేస్తున్నారు. దీన్నే క్రిప్టోజాకింగ్‌ అంటున్నారు. ఫలితంగా మన కంప్యూటర్లు పనిచేసే వేగం గణనీయంగా తగ్గిపోతుంది. దాంతోపాటు బ్యాటరీలు వేగంగా వేడెక్కిపోవచ్చు.. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్లు అస్సలు పనికి రాకుండా పోవచ్చు కూడా. సంస్థల విషయానికొస్తే.. ఈ క్రిప్టోజాకింగ్‌ వల్ల నెట్‌వర్క్‌ మొత్తం సమస్యలకు గురికావచ్చు.. క్లౌడ్‌ సీపీయూ వాడకం పెరగడం ద్వారా కంపెనీలకు ఖర్చులూ పెరిగిపోతాయి. ఇంకోలా చెప్పాలంటే మన మొబైల్, పీసీ, ట్యాబ్లెట్‌ లేదా ఇంటర్నెట్‌ ఆధారిత(ఐఓటీ) పరికరాల కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని వాడుకుని హ్యాకర్లు క్రిప్టోకరెన్సీని పొందుతారన్నమాట. గత ఏడాది కాలంలో ఐఓటీ పరికరాలపై హ్యాకర్ల దాడులు దాదాపు ఆరు రెట్లు ఎక్కవైనట్లు సైమాంటిక్‌ అంచనా కట్టింది.

మొబైల్‌ మాల్‌వేర్‌లోనూ పెరుగుదల..
స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో హ్యాకర్లు ఈ ప్లాట్‌ఫామ్‌నూ తమ అవసరాలకు వాడుకోవడం ఎక్కువైంది. సైమాంటిక్‌ గత ఏడాదిలో ప్రతి రోజూ దాదాపు 24 వేల మాల్‌వేర్లను మొబైల్‌ ఫోన్లలోకి చేరకుండా అడ్డుకుందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రెండ్‌ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటని.. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అప్‌టుడేట్‌గా ఉంచుకోకపోవడం వల్ల ఇక్కడ సమస్య మరింత జటిలమవుతోందని సైమాంటిక్‌ తన నివేదికలో తెలిపింది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులనే తీసుకుంటే 20 శాతం మంది మాత్రమే తాజా వెర్షన్‌ను వాడుతున్నారని, 2.3 శాతం మంది తాజా మైనర్‌ రిలీజ్‌ను ఉపయోగిస్తున్నట్లు వివరించింది. అంతేకాక ‘గ్రే వేర్‌’ యాప్స్‌(అప్లికేషన్‌లా పనిచేస్తూనే కొన్ని ఇతర పనులు చేసేవి) ద్వారా ఫోన్‌ నంబర్లను ఇతరులకు చేరవేయడం పెరిగిపోతోందని నివేదిక తెలిపింది. గత ఏడాది ఈ గ్రే వేర్‌ల వాడకం దాదాపు 20 శాతం ఎక్కువైనట్లు అంచనా. సైబర్‌ దాడుల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడంతోపాటు, యాంటీవైరస్‌ను వాడాలని సైమాంటిక్‌ సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement