
డిజిటల్, ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉండే కరెన్సీలకు హ్యాకింగ్ ముప్పు హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ హ్యాకర్లు వీటిపై దాడి చేస్తే పెట్టుబడులు పెట్టిన డబ్బునంతా కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అనుకున్నట్టే జరిగింది. డిజిటల్ వాలెట్ ప్రొవైడర్ బ్లాక్‌వాలెట్‌ను కొల్లగొట్టిన హ్యాకర్లు, ఏకంగా 4 లక్షల డాలర్ల అంటే రూ.2.5 కోట్ల స్టెల్లర్ క్రిప్టోకరెన్సీని దొంగలించారు. బ్లాక్‌వాలెట్ నిర్వహించే సర్వర్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని సీఎన్‌ఎన్ రిపోర్టు చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ వ్యవస్థాపకుడే స్వయంగా తెలిపినట్టు పేర్కొంది. ఆన్‌లైన్ స్టెల్లర్ వాలెట్ బ్లాక్‌వాలెట్ హ్యాక్ అయినట్టు పేర్కొన్నట్టు తెలిపింది. ఆర్బిట్ 84 అనే ఖాతాదారుడికి చెందిన అకౌంట్‌ను హ్యాకర్లు ఛేదించి డీఎన్‌ఎస్ సెట్టింగ్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్నారని బ్లాక్‌వాలెట్ పేర్కొంది.
దీని నుంచి 4,00,000 డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని మళ్లించినట్టు తెలిపింది. ఫోరమ్స్ ద్వారా అటాక్స్ జరుగుతున్న విషయాన్ని బ్లాక్‌వాలెట్ తన యూజర్లకు తెలుపుతూ... అప్రమత్తంగా ఉండాలంటూ వార్నింగ్ ఇస్తోంది. హ్యాకర్లు దొంగలించిన ఈ క్రిప్టోకరెన్సీని బిట్టరెక్స్ అనే వర్చ్యువల్ కరెన్సీ ఎక్స్చేంజ్‌కు మరలించినట్టు తెలిసింది. మరో డిజిటల్ కరెన్సీలోకి వీటిని మార్చుతున్నట్టు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ హ్యాక్ కావడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో స్లొవేనియాకు చెందిన నైస్ హ్యాష్ అనే క్రిప్టో కరెన్సీ మైనింగ్ మార్కెట్‌ను హ్యాకర్లు కొల్లగొట్టారు. అప్పట్లో దాదాపు 4,736.42 బిట్‌కాయిన్లు అంటే 60మిలియన్ డాలర్లు(రూ.384 కోట్లు) గల్లంతయ్యాయి. దీంతో ఆ కంపెనీ సీఈవో రాజీనామా చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment