
సంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్..
లాస్ వెగాస్ : అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి డిబేట్ లో తన ప్రసంగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్తో చర్చలో హోరా హోరీగా తలపడటంపై ఆయన సంతృప్తి చెందారు. చర్చ ముగిసిన అనంతరం వివిధ అంశాలపై తాను వెల్లడించిన అన్ని విషయాలు ఉత్తేజకరంగా ఉన్నాయన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ ఆయన ట్విట్ చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అమెరికా లాస్‌వెగాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నెవాడాలో బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) చివరి డిబేట్ 90 నిమిషాలు పాటు జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చుకున్నారు. సూటిగా సమాధానాలు ఇస్తూనే, ఒకరిపై మరొకరు చెణుకులు విసురుకున్నారు.
ఒపీనియన్ పోల్స్‌లో చాలా వెనుకబడ్డ ట్రంప్ కీలకమైన మూడవ చర్చలో పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో ఆయన కొద్దిపాటి అసహనంతో పాటు చికాకు పడ్డారు. అంతేకాకుండా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి కౌంటర్ చేసేందుకు చమత్కారంగా సమాధానం ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. గన్ కల్చర్, అక్రమ వలసదారులు, అబార్షన్ హక్కులపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే ఉంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం హిల్లరీ ముందంజలో ఉన్నారు.
That was really exciting. Made all of my points. MAKE AMERICA GREAT AGAIN!
— Donald J. Trump (@realDonaldTrump) 20 October 2016