రెహమ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ (పాత ఫొటో)
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్‌సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ పుస్తకంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇమ్రాన్ ఖాన్, రెహమ్ ఖాన్‌ల దాంపత్య జీవితం గురించి పుస్తకంలో రెహమ్ రాసినట్లు ఆ దేశానికి చెందిన డాన్ పత్రిక పేర్కొంది. పుస్తకంలోని కాంట్రవర్సీ అంశాలను తొలగించాలని పీటీఐ డిమాండ్ చేసింది.
లేకపోతే రెహమ్‌పై క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించింది. శృంగార సంబంధిత అంశాలను రెహమ్ పుస్తకంలో రాశారని, ఈ పుస్తకం విడుదల కావడం వల్ల కుటుంబ విలువలు దెబ్బతింటారని పార్టీ సెక్రటరీ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో రెహమ్ ఈ పుస్తకాన్ని విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెహమ్ ఈ సమయంలో పుస్తకం విడుదల చేయడం వెనుక మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ హస్తం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, 2015లో రెహమ్, ఇమ్రాన్ ఖాన్‌లు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2018 జనవరిలో ఇమ్రాన్ బుష్రా మాలిక్‌ను వివాహమాడారు. అయితే, పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని ఇమ్రాన్ బయటపెట్టారు.
తనను పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా ఇమ్రాన్ ఇలానే కొన్నాళ్లు రహస్యంగా ఉంచారని రెహమ్ పేర్కొన్నారు. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను పుస్తకంలో రాసినట్లు రెహమ్ తెలిపారు. అయితే, ఇమ్రాన్‌పై కోపం పెట్టుకుని, ఆ కక్షతో పుస్తకం రాయలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment