
పనులన్నీ రోబోలు చేస్తే.. మనమేం చేయాలి?
ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ రేపటి రోజున రోబోలు, కంప్యూటర్లే చేయగలగితే... అప్పుడు మనమేం చేయాలి? రానున్న కాలంలో ఎలాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎంతో మందిలో తొలుస్తున్న ప్రశ్న ఇది. ఈ విషయంలో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ దీనిపై కొంత అధ్యయనం చేసింది.
మరో యాభై ఏళ్లలో ఈ ప్రపంచం ఎంతగానో మారిపోనుంది. కాలానుగుణంగా ఇప్పుడు మనం చేస్తున్న పనిలో యాభై శాతం పనిని రోబోలు, కంప్యూటర్లే చేస్తాయని అమెరికాలోని ముప్పావుశాతం ప్రజలు నమ్ముతున్నారు. రానున్న కాలంలో ఆటోమేషన్ వల్ల 50 లక్షల ఉద్యోగాలు పోవచ్చని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ ‘ఫ్యూచర్ ఫర్ జాబ్స్’ తాజా నివేదికలో పేర్కొంది.
అంత మంది ఉద్యోగాలకు ఎసరొస్తే... అప్పుడేం చేయాలి? పయనం ఎటువైపు? దానికి సమాధానమేంటంటే... అప్పటికి కొత్త రంగాలు ఆవిర్భవిస్తాయి. అందులో ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయి. కానీ ఎంత శాతం కొత్త ఉద్యోగాలు వస్తాయన్నది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్న. అందుకని ఏయే రంగాలు అభివృద్ధి చెందుతాయో ఇప్పటి నుంచే అంచనావేసి ఆ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం మంచిదని అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) నివేదిక చెబుతోంది.
యాభై ఏళ్లలో ఉద్యోగ రంగంలో వచ్చే మార్పుల ప్రభావం ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై లేకపోయినప్పటీకీ ఆయా రంగాల వారు కూడా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం మాత్రం తప్పదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని రకాల ఉద్యోగాలు తెరమరుగైనప్పటికీ కొత్తగా వచ్చే మార్పులకు అనుగుణంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వెల్లడించింది. ఆటోమేషన్ కు సంబంధం లేని ఉద్యోగాల్లో అది కూడా నైపుణ్యం బాగా పెంచుకోగలగితే తప్ప భవిష్యత్తు ఉండదని అంచనా. సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న వారు కూడా తమలో నైపుణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉంటుంది.
* ఇప్పటి నుంచి 2014 నాటికి సాఫ్ట్ వేర్ డెవలపర్, కంప్యూటర్ సిస్టమ్స్ అనలిస్ట్, మార్కెట్ రీసెర్చ్, మార్కెటింగ్ స్పెషలిస్ట్ జాబ్స్ ఐదింతలు పెరుగుతాయని బీఎల్‌ఎస్ అంచనావేసింది.
* మెడికల్ టెక్నిషియన్స్, ఫిజికల్ థెరపిస్టులు, వర్కప్లేస్ ఎర్గోనమిక్స్ ఎక్స్‌పర్ట్ జాబ్‌లు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.
* సేల్స్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్టులు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్‌లు పెరుగుతాయని, పెరుగుదల కనిపించే ఐదు రంగాల్లో ముఖ్యంగా సేల్స్ సంబంధిత ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయని ‘ఫ్యూచర్ జాబ్’ నివేదిక తెలిపింది.
ఈ రంగంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవసరమవుతాయని, రోబోలు ఈ పనులను చేయలేవు కనుక ఈ రంగంలో ఉద్యోగాలకు కొదవ ఉండదని నివేదిక పేర్కొంది.
* వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యా, ఉద్యోగ శిక్షణా కార్యక్రమాలు కూడా ముఖ్యమే. అందుకనే అభివృద్ధి చెందే రంగాల్లో ఈ రంగం ఆరో స్థానంలో నిలిచినట్లు ‘ఫ్యూచర్ జాబ్స్’ నివేదిక తెలిపింది.
* మేనేజ్‌మెంట్ అనలిస్ట్‌లు, అకౌంటెంట్లు, ఆడిటర్లు పురోభివృద్ధి రెండంకెల్లో ఉంటుందని, నేడున్న ఉద్యోగ నైపుణ్యాన్ని 2020 నాటికి మూడింతలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా ఆ నివేదిక వివరించింది.