సిరియా వైపుగా కదులుతున్న రష్యా యుద్ధనౌకలు
ఇస్తాంబుల్: సిరియాలో ప్రభుత్వం పౌరులపై రసాయన ఆయుధాలు ప్రయోగించిందన్న ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా దాడులకు సిద్ధమవుతుండగా.. మరో పక్క దాడులను వ్యతిరేకిస్తున్న రష్యా తన యుద్ధనౌకలను సిరియా వైపుగా పంపుతోంది. రష్యాకు చెందిన మూడు యుద్ధనౌకలు గురువారం టర్కీకి చెందిన బోస్ఫోరస్ స్ట్రెయిట్ ప్రాంతాన్ని దాటి సిరియా తీరం వైపుగా ప్రయాణం ప్రారంభించాయి. దీంతో మధ్యధరా ప్రాంతంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి.
సిరియా సంక్షోభం నేపథ్యంలో దాని మిత్ర దేశమైన రష్యా కొన్ని నెలలుగా నాలుగు యుద్ధనౌకలను అప్రమత్తం చేసింది. సిరియా నావికాదళ పోర్టులో రష్యాకు స్థావరం కూడా ఉంది. రసాయన దాడుల నెపంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐరాస అనుమతి లేకుండానే అమెరికా మిలటరీ దాడులు చేపట్టడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.