మారణహోమమా..? అబ్బే ఉత్తిదే! | Sakshi interview with Myanmar Ambassador | Sakshi
Sakshi News home page

మారణహోమమా..? అబ్బే ఉత్తిదే!

Published Sun, Apr 8 2018 3:58 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Sakshi interview with Myanmar Ambassador

సాక్షి, హైదరాబాద్‌: మయన్మార్‌లో రొహింగ్యా ముస్లింల మారణహోమం జరగలేదని ఆ దేశ రాయ బారి మవ్‌ చా అంగ్‌ తోసిపుచ్చారు. రొహింగ్యా ప్రజలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్ని కట్టుకథలని కొట్టిపారేశారు. దేశ సరిహద్దులోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారని, దీంతో సైన్యం జరిపిన ప్రతిదాడిలో కేవలం 10 మంది మాత్రమే మరణించారన్నారు. అంతకు మించి ఏమీ జరగలేదని, మారణ హోమం జరిగిందని చెప్తున్న వారే ఆధారాలు చూపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటా మన్నారు. మయన్మార్‌లోని రోహింగ్య ముస్లింలపై గతేడాది సెప్టెంబర్‌లో అక్కడి సైన్యం జరిపిన దాడుల్లో వందలాది మంది మరణించడంతో పాటు దాదాపు 5 లక్షల మంది కట్టుబట్టలతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు పారిపోయి తలదాచుకుంటున్న విష యం తెలిసిందే.  మనుషుల అక్రమ రవాణాకు వ్యతి రేకంగా శనివారం నగరంలో ప్రారంభమైన ‘దక్షిణాసియా దేశాల సదస్సు’లో పాల్గొనడానికి వచ్చిన మవ్‌ చా అంగ్‌ ...రోహింగ్యా ముస్లింల సంక్షోభంపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ప్రశ్న: మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చారు. మీ దేశంలో రోహింగ్యా ముస్లిం మహిళలపై సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగాయి. వారు మహిళలు కారా? 
మవ్‌ చా అంగ్‌:  అలాంటి దేమీ జరగలేదు. 

ప్రశ్న: పెద్ద సంఖ్యలో రొహింగ్యాలు ఆశ్రయం కోల్పోయి పరాయిదేశం బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు? ఇది మనుషుల అక్రమ రవాణాకు దారితీయదా? 
మవ్‌ చా అంగ్‌: మా దేశంలో ఎలాంటి మారణహోమం జరగలేదు. అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ప్రజలు రక్షణ కోసం పారిపోయారు. 

ప్రశ్న: రోహింగ్యాలు దేశం విడిచి వెళ్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు వారిని ఆపలేకపోయిం ది? బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయిన 5లక్షల మంది రొహింగ్యాలు తిరిగి వచ్చేందుకు మీ ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు?
మవ్‌ చా అంగ్‌:  ఎదురు కాల్పులు జరుగు తున్నప్పుడు రక్షణ కోసం వెళ్లిపోతున్న వారిని ఆపడం సాధ్యం కాదు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ తర్వాత వెనక్కి వచ్చే వారిని అనుమతిస్తున్నాం. ఇప్పటికే కొందరు తిరిగి వచ్చారు.  

ప్రశ్న: రొహింగ్యాలు తమ సొంత దేశంలోనే సురక్షితంగా లేరన్నది వాస్తవం కాదా?
మవ్‌ చా అంగ్‌:  మా దేశంలో ప్రజలందరికీ రక్షణ కల్పిస్తున్నాం.

ప్రశ్న: మీ ప్రభుత్వం ప్రతి ప్రాణానికి భరోసా కల్పిస్తుందా? 
మవ్‌ చా అంగ్‌: కచ్చితంగా.. మా దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. 

ప్రశ్న: మారణహోమం జరగలేదని అంటు న్నారు కదా.. వాస్తవాలు తెలుసుకో వడానికి మీ ప్రభుత్వం అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడం లేదు? 
మవ్‌ చా అంగ్‌: అంతర్జాతీయ దౌత్యవేత్తలు మా దేశంలో సందర్శించారు. అంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో అంతర్జాతీయ మీడి యాను అనుమతించలేం. మీ దేశంలో కూడా ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో అంతర్జా తీయ మీడియా పర్యటించేందుకు ప్రభు త్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉం టుంది. ఐక్య రాజ్య సమితి, ఇతర అంతర్జా తీయ సంస్థలను దేశంలోకి అనుమతించాం. 

ప్రశ్న: రోహింగ్యా ముస్లింలను చంపి సామూ హికంగా పాతిపెట్టిన సమాధులను వెలుగు లోకి తెచ్చిన ముగ్గురు రాయిటర్స్‌ జర్నలి స్టులను అరెస్టు చేయడం ఎంతవరకు సబబు? 
మవ్‌ చా అంగ్‌: అధికారిక రహస్యాల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకే వారిని అరెస్టు చేశాం. మా దేశం చట్ట ప్రకారం నడుచుకుంటోంది. సామూహిక సమాధులను వెలుగులోకి తెచ్చినందుకు అరెస్టు చేయలేదు. 

ప్రశ్న: రోహింగ్యాలను ఊచకోత కోశారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థలు సైతం ఆరోపించాయి?
మవ్‌ చా అంగ్‌: అలా జరిగితే ఆధారాలు చూపమని అడుగుతున్నాం. దేన్ని దాచలేం. వెయ్యి మంది హత్యకు గురయ్యారని అనుకోండి. ఎక్కడ జరిగిందో చూపండి. కొందరు కట్టు కథలు చెప్పారు. ఆధారాలు చూపిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  

ప్రశ్న: రొహింగ్యా ముస్లింలకు పౌరసత్వం ఎందుకు జారీ చేయడం లేదు?
మవ్‌చాఅంగ్‌: చట్టప్రకారం నడుస్తాం

ప్రశ్న: మయన్మార్‌లో బౌద్ధ తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో మీ ప్రభుత్వం విఫలమైం దని ఆరోపణలున్నాయి?
మవ్‌ చా అంగ్‌:   కేవలం 10 మంది మాత్రమే  మృతి చెందారు. ఉగ్రవాదుల చేతిలో అంతకంటే ఎక్కువ మంది హతమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement